హన్ని మృతదేహం
కడ్తాల్(కల్వకుర్తి): నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చాడో కిరాతకుడు. తన పొలంలో పశువులు మేపిందనే నెపంతో భార్యతో కలిసి కన్నతల్లినే కొట్టిచంపాడు. కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నార్లకుంట తండాకు చెందిన బాణవత్ హన్ని – వస్య దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి, మూడో కుమారులైన రాములు, రవి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతుండగా.. రెండో కుమారుడైన రేఖ్య భార్య పిల్లలతో కలిసి తండాలోనే తల్లిదండ్రులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నాడు.
చిన్న కుమారుడైన రవికి చెందిన పొలాన్ని, పశువులను తల్లి హన్ని (65) చూసుకుంటూ ఉండేది. వాటిపై వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్‌లో ఉండే కుమారుడు రవికి పంపిస్తుండేది. శుక్రవారం ఉదయం రవికి చెందిన పశువులు రేఖ్య పొలంలో మేయడంతో రేఖ్య అతని భార్య నీలాలు హన్నిపై దాడిచేశారు. కన్నతల్లి అని చూడకుండా రేఖ్య రాయితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సంఘటనను గమనించిన స్థానికులు, తండా ప్రజలు రేఖ్యను మందలించి వదిలివేయగా.. హన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కడ్తాల్‌కు బయలుదేరింది.
దీంతో రేఖ్య, అతని భార్య నీలా కలిసి మార్గమధ్యలో కర్కల్‌పహాడ్ సమీపంలో మరోసారి దాడిచేసి గాయపరిచారు. పిడిగుద్దులు గుద్ది, తన్ని తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, తండా వాసులు చిన్న కుమారుడు రవికి సమాచారమిచ్చి, హన్నిని చికిత్స నిమిత్తం కడ్తాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తల్లి హన్నిని రవి వెంట తీసుకుని ఆటోలో తండాకు వెళ్లాడు.
తీవ్ర గాయాలు కావడంతో శనివారం ఉదయం హన్ని తండాలోని ఇంటి వద్ద మృతిచెందింది. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సుందరయ్యలు తండాలకు వెళ్లి వివరాలు సేకరించారు. హన్ని పెద్ద కొడుకు రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment