డబ్బులు డ్రా చేసినా అకౌంట్లో కట్ అవ్వవు.. | South Indian Bank Complaint on ATM Cyber Crime | Sakshi
Sakshi News home page

ఏటీఎంనే ఏమార్చారు!

Published Thu, May 9 2019 8:00 AM | Last Updated on Thu, May 9 2019 8:00 AM

South Indian Bank Complaint on ATM Cyber Crime - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో కొత్త తరహా ‘ఏటీఎం సైబర్‌ క్రైమ్‌’ వెలుగులోకి వచ్చింది. డబ్బు డ్రా చేసుకోవడానికి వస్తున్న కొన్ని ముఠాలు మిషన్‌కు సాంకేతిక ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఫలితంగా డబ్బు డ్రా అయినా.. కానట్లే రికార్డు అవుతోంది. ఈ పంథాలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌నకు రూ.1.3 లక్షలు టోకరా వేశారు. ఈ బ్యాంకు అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది హరియాణా సరిహద్దుల్లోని మేవాట్‌ రీజియన్‌కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. ఏటీఎం యంత్రంలో డిపాజిట్‌ చేసిన నగదుకు, విత్‌డ్రా అయిన దానికి మధ్య తేడాను సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు అధికారులు ఇటీవల గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఓ ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఐదుసార్లు  గుర్తుతెలియని వ్యక్తులు ఈ మొత్తం డ్రా చేసినట్లు గుర్తించారు.

సీసీ కెమెరాలో రికార్డు అయిన వివరాల ప్రకారం.. ముందుగా ఆ ఏటీఎం కేంద్రంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఏటీఎం కేంద్రానికి విద్యుత్‌ సరఫరా అయ్యే ప్రాంతంలో ఒకరు సిద్ధంగా ఉంటుండగా... మరో వ్యక్తి ఏటీఎంలో కార్డుతో డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఓ వ్యక్తి తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డు వినియోగించి లావాదేవీ మొత్తం పూర్తి చేస్తున్నాడు. మిషన్‌ నుంచి డబ్బు బయటకు వచ్చిన తర్వాత.. ట్రాన్సాక్షన్‌ పూర్తి కావడానికి మధ్య నాలుగైదు సెకన్ల తేడా ఉంటోంది. ఆ సమయం తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్‌పై డిస్‌ప్లే కావడంతో పాటు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తుంది. ఈ అతితక్కువ సమయాన్నే ఈ గ్యాంగ్‌ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఆ సమయంలోనే ఏటీఎంకు విద్యుత్‌ సరఫరా అయ్యే చోట ఉన్న వ్యక్తి పవర్‌ సప్లయ్‌ ఆపేయడం ద్వారా సదరు మిషన్‌కు సాంకేతిక సమస్య సృష్టిస్తున్నారు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకువచ్చినా అందులో మాత్రం సదరు లావాదేవీ ఫెయిల్‌ అయినట్లు నమోదు అవుతోంది.

ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్‌ కూడా ప్రింట్‌ అయి వస్తోంది. ఇలా డబ్బు తీసుకున్నా దాన్ని ఏటీఎం లెక్కల్లోకి ఎక్కకుండా చేస్తున్నారు. ప్రధానంగా సెక్యూరిటీ గార్డులు లేని, కాస్త పాత ఏటీఎం మిషన్లనే ఈ ముఠా టార్గెట్‌ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి ఒకే  రోజు డబ్బు తీయకుండా మార్చి 3, 21 తేదీలతో పాటు ఏప్రిల్‌ 27, 28, 29 తేదీల్లో డ్రా చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement