పోలీస్‌ శాఖలో కుదుపు | SP PhD Ramakrishna Cleansing in police department | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో కుదుపు

Published Wed, Oct 18 2017 1:05 PM | Last Updated on Wed, Oct 18 2017 1:05 PM

SP PhD Ramakrishna Cleansing in police department

నెల్లూరు (క్రైమ్‌): పోలీస్‌ శాఖను క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పోలీస్‌ విభాగానికి మచ్చతెస్తున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోఏళ్ల తరబడి పాతుకుపోయిన 42 మంది మినిస్టీరియల్‌ సిబ్బందిపై బదిలీ వేటు వేసిన ఎస్పీ 24 గంటలు గడవకముందే అవినీతిపరులైన 52 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వీఆర్‌కు పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ స్థాయిలో పోలీస్‌ సిబ్బందిని వీఆర్‌కు పిలవడం ఇదే ప్రథమం.

ఫిర్యాదుల నేపథ్యంలో.. క్రికెట్‌ బెట్టింగ్, ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా, గుట్కా మాఫియాలకు సహకరించడం, బాధితులను నిలువు దోపిడీకి గురిచేయడం, కేసులను నీరుగార్చడం, విధులను నిర్లక్ష్యం చేస్తూ ఏళ్ల తరబడి పాతుకుపోయిన పోలీసు అధికారులు, మఫ్టీ (జీడీ) కానిస్టేబుల్స్, హోంగార్డులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిపై నిఘా విభాగం నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ 52 మందితో కూడిన జాబితాను తయారుచేశారు. మంగళవారం వారందరిపైనా వీఆర్‌ వేటు వేశారు. వెంటనే వి«ధుల నుంచి రిలీవ్‌ చేయాలంటూ ఆదేశించారు. మునుపెన్నడూ లేనివిధంగా హోంగార్డులను సైతం వీఆర్‌కు పిలిచారు. 24 గంటల వ్యవధిలో 42 మంది పరిపాలన సిబ్బందిని బదిలీ చేయడం, 52 మంది పోలీస్‌ సిబ్బందిని వీఆర్‌కు పిలవడం పోలీస్‌ శాఖను చర్చనీయాంశమైంది. వీరిలో 30 మంది కానిస్టేబుల్స్‌ కాగా, ఒక ఎస్సై, నలుగురు ఏఎస్సైలు, ఏడుగురు హెడ్‌ కానిస్టేబుల్స్, 10 మంది హోంగార్డులు ఉన్నారు. శాఖాపరమైన అవినీతిని నిర్మూలించే దిశగా ఎస్పీ చేపడుతున్న చర్యలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనన్న భయాందోళన ఆ శాఖ ఉద్యోగుల్లో నెలకొంది.

అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూనే..
ఓ వైపు అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తూనే సొంత శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపైనా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ దృష్టి సారించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాలకు సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను ఇప్పటికే వీఆర్‌కు పంపించిన విషయం విదితమే. గతంలో చిల్లకూరు, తడ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు కేసులను నీరుగార్చి, భారీగా నగదు కూడగట్టారని, అప్పటి డీఎస్పీకి అన్నీ తామై వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ ఇద్దరు ఎస్సైలను ఇటీవల వీఆర్‌కు పిలిచారు. వారికి సహకరించిన సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌పై సైతం వీఆర్‌ వేటు వేశారు. పోలీస్‌ పరిపాలన విభాగంలోని కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోవడాన్ని గమనించిన ఆయన సోమవారం 42 మంది మినిస్టీరియల్‌ సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీలకు ఎవరూ అతీతులు కారని నిరూపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement