
వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి
దుండిగల్: జల్సాలకు అలవాటు పడి కొరియర్ బాయ్‌లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ నర్సింహారావు, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ కలిసి వివరాలు వెల్లడించారు. ప్రగతినగర్, మధురానగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమారుడు తుంగల శ్రీరామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలో కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్ వద్ద బైక్‌ను చోరీ చేసిన ఘటనలో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు.
దొరికింది ఇలా..
తరచూ కొరియర్ బాయ్స్ బ్యాగ్‌లు చోరీలకు గురవుతుండటంతో అమేజాన్ సంస్థ ప్రతినిధులు దుండిగల్ పోలీసులకు ఫిరా>్యదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, ఎస్సై భూపాల్ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి వై–జంక్షన్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా చోరీ చేసిన వాహనంపై తిరుగుతున్న శ్రీరామ్‌ను గుర్తించారు. దీంతో అతడిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సోమవారం దుండిగల్‌లో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి రూ.4 లక్షలు విలువైన రెండు బైక్‌లు, 15 సెల్‌ఫోన్లు, నాలుగు డెలివరీ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై భూపాల్‌గౌడ్ తో పాటు కానిస్టేబుళ్లు చంద్రయ్య, కేశవులు, సమ్మయ్య, భీంబాబు, ఎస్.కె.రహీం, ఆర్.శ్రీనివాస్‌రావు, రాంచందర్‌లను డీసీపీ నగదు పురస్కారంతో సత్కరించారు.
కాపు కాసి కొట్టేస్తాడు..
శ్రీరామ్ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి వై– జంక్షన్ ప్రాంతాల్లో మకాం వేసే శ్రీరామ్ ఆయా ప్రాంతాల గుండా వెళ్లే కొరియర్ బాయ్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని వెంబడించే అతను కొరియర్ బాయ్స్ తమ బ్యాగ్‌లను బైక్‌పై ఉంచి పార్శిల్ డెలివరీ చేసే వచ్చేలోగా బ్యాగ్‌లతో ఉడాయిస్తాడు. ఈ చోరీలకు గాను తాను దొంగిలించిన వాహనంతో పాటు తన తండ్రి బైక్‌ను వినియోగించేవాడు. ఇదే తరహాలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, బేగంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో దొంగతనానికి పాల్పడ్డాడు. అతను ఎక్కువగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్ కంపెనీలకు చెందిన డెలివరీ బాయ్స్‌ను మాత్రమే టార్గెట్‌గా చేసుకునేవాడు. చోరీ చేసిన వస్తువులను విక్రయించి జల్సా చేసేశాడు.
Comments
Please login to add a commentAdd a comment