courier boy
-
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
కొరియర్ అని నమ్మించి.. వృద్ధురాలిని బంధించి..
నాగోలు: కొరియర్ ఉందని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు దుండగులు వృద్ధురాలిని బాత్రూంలో బంధించి అమె ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో దోపిడీకి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10. 5 తులాల బంగారం, రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపిన మేరకు.. సచివాలయనగర్‌లో వెంకటనర్సమ్మ (84)నివాసం ఉంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేలపూడి సురేష్‌కుమార్(31) మాన్సూరాబాద్ బేతస్ధ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాకు చెందిన పరమిజిత్సింగ్ (43) నగరంలో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు పాత నేరస్తులు దొంగతనం కేసులో 2016లో జైలుకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో వనస్ధలిపురం సచివాలయనగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్న వెంకటనర్సమ్మను వీరు గమనించారు. గత నెల 26న తేదీ కొరియర్ వచ్చిందని చెప్పి వెంకటనర్సమ్మ ఇంట్లోకి వెళ్లారు. అమెను బెదిరించి బాత్ రూమ్‌లో బంధించి ఆమె దగ్గర ఉన్న 10 తులాల బంగారం, 50 వేల నగదు తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఇంజాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నిందితులు హోండా యాక్టివాపై వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపి డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించారు. నిందితులు పత్రాలు చూపించకుండా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వనస్ధలిపురం డబుల్ బెడ్ రూమ్ పార్కింగ్ వద్ద యాక్టివాను చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరినీ విచారణ చేయగా గతంలో వీరిపైన వనస్థలిపురం, పటన్‌చెరువు, నాందేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భీమ్‌రెడ్డి, సీఐ జలేందర్‌రెడ్డి, డిఐ వెంకట్, ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ కొరియర్ బాయ్ మామూలోడు కాదు!
ముంబై : ఓ కొరియర్ బాయ్ దొంగబుద్ధి అతడి కొంపముంచింది. నగల పార్శిల్‌తో పరారైన అతడు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ సంఘటనలో ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన పరాస్ భన్సాలీ(53) అనే వ్యాపారవేత్త కొద్దిరోజుల క్రితం నగలను వేరే చోటుకు పంపటానికి ఆన్లైన్ కొరియర్ యాప్‌ను ఎంచుకున్నాడు. కొరియర్ బాయ్ రఫికీ సయా(36) ఆ పార్శిల్‌ను తీసుకుపోవటానికి ఆయన ఇంటికి వచ్చాడు. పార్శిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అందులో ఖరీదైన వస్తువులు ఉన్నాయని భావించిన రఫికీ దొంగతనానికి ప్లాన్ చేశాడు. ( ఆన్లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్) అనంతరం పార్శిల్‌ను డెలివరీ చేయకుండా ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ దాన్ని ఓపెన్ చేసి చూడగా బంగారు పోత పోసిన వెండి వస్తువులు కనిపించాయి. అయితే డిసెంబర్ 10న డెలివరీ అవ్వాల్సిన పార్శిల్ 18వ తేదీ వచ్చినా అవ్వలేదు. దీంతో పరాస్ భన్సాలీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఫికీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి 1,43,000 రూపాయల విలువైన నగలను స్వాధీనం చేసుకుని, బాధితుడికి అప్పజెప్పారు. -
కొరియర్ బాయ్లే టార్గెట్..!
దుండిగల్: జల్సాలకు అలవాటు పడి కొరియర్ బాయ్‌లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ నర్సింహారావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్ కలిసి వివరాలు వెల్లడించారు. ప్రగతినగర్, మధురానగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు కుమారుడు తుంగల శ్రీరామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలో కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్ వద్ద బైక్‌ను చోరీ చేసిన ఘటనలో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అతని వైఖరిలో మార్పు రాలేదు. దొరికింది ఇలా.. తరచూ కొరియర్ బాయ్స్ బ్యాగ్‌లు చోరీలకు గురవుతుండటంతో అమేజాన్ సంస్థ ప్రతినిధులు దుండిగల్ పోలీసులకు ఫిరా>్యదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ వెంకటేశ్, ఎస్సై భూపాల్ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్పల్లి వై–జంక్షన్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా చోరీ చేసిన వాహనంపై తిరుగుతున్న శ్రీరామ్‌ను గుర్తించారు. దీంతో అతడిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సోమవారం దుండిగల్‌లో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి రూ.4 లక్షలు విలువైన రెండు బైక్‌లు, 15 సెల్ఫోన్లు, నాలుగు డెలివరీ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై భూపాల్‌గౌడ్ తో పాటు కానిస్టేబుళ్లు చంద్రయ్య, కేశవులు, సమ్మయ్య, భీంబాబు, ఎస్.కె.రహీం, ఆర్.శ్రీనివాస్‌రావు, రాంచందర్‌లను డీసీపీ నగదు పురస్కారంతో సత్కరించారు. కాపు కాసి కొట్టేస్తాడు.. శ్రీరామ్ షాపూర్‌నగర్, బాలానగర్, కూకట్పల్లి వై– జంక్షన్ ప్రాంతాల్లో మకాం వేసే శ్రీరామ్ ఆయా ప్రాంతాల గుండా వెళ్లే కొరియర్ బాయ్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని వెంబడించే అతను కొరియర్ బాయ్స్ తమ బ్యాగ్‌లను బైక్‌పై ఉంచి పార్శిల్ డెలివరీ చేసే వచ్చేలోగా బ్యాగ్‌లతో ఉడాయిస్తాడు. ఈ చోరీలకు గాను తాను దొంగిలించిన వాహనంతో పాటు తన తండ్రి బైక్‌ను వినియోగించేవాడు. ఇదే తరహాలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్‌నగర్, బేగంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో దొంగతనానికి పాల్పడ్డాడు. అతను ఎక్కువగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్ కంపెనీలకు చెందిన డెలివరీ బాయ్స్‌ను మాత్రమే టార్గెట్‌గా చేసుకునేవాడు. చోరీ చేసిన వస్తువులను విక్రయించి జల్సా చేసేశాడు. -
‘అరుదైన’ నెలలోనే చిక్కాడు...
సాక్షి, సిటీబ్యూరో: షెల్ కంపెనీ ఏర్పాటు చేసి బోగస్ వ్యక్తుల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా రెండేళ్లల్లో నాలుగు బ్యాంకులను రూ.1.52 కోట్లకు ముంచిన కుంభం రంగారెడ్డిని పట్టుకోవడంలో నగర పోలీసు విభాగం సమీకరించుకున్న ‘360 డిగ్రీస్ వ్యూ’ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపకరించింది. ఇందులో కేసుల దర్యాప్తునకు ఉపకరించే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మరోపక్క రంగారెడ్డి కేసుకు సంబంధించి కొందరు కొరియర్ బాయ్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గురువారం చిక్కిన ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో రెండు బ్యాంకులకు అధికారిక సమాచారం ఇచ్చేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. ‘పేర్లు’ మారుస్తూ తప్పుదారి... నగర పోలీసు గడిచిన కొన్నాళ్లుగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్త్రృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీనిని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్ళలో కొందరు, ఆర్థిక నేరాలకు పాల్పడి అజ్ఞాతంలోకి వెళ్ళిన వారు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓసారి అరెస్టు అయినప్పుడు ఇంటి పేరు ముందు, అసలు పేరు వెనుక చెబుతూ, మరోసారి అరెస్టు అయిన సందర్భంలో పేరు ముందు, ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇలాంటి మార్పు చేర్పులతోనే తమ గుర్తింపును సైతం మార్చేసుకుంటున్నారు. స్పెల్లింగ్స్‌లో మార్పుచేర్పులు చేస్తూ... ఇలాంటి ‘మార్పిడిగాళ్ళు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టైన ప్రతిసారీ బెయిల్ పొందడం కోసం న్యాయస్థానంలో, ఇతర సదుపాయాల కోసం ఆయా విభాగాల దగ్గర ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టు అయినప్పుడు చివరి స్పెల్లింగ్ (వైవైఏ) అంటూ, మరోసారి చిక్కినప్పుడు దీన్ని (ఐఏహెచ్)గా రాస్తూ బురిడీ కొట్టిస్తుంటారు. ఈ తరహా కేటుగాళ్ళ సంఖ్య పెరిగినట్లు తేలడంతో పోలీసు విభాగం ‘360 డిగ్రీస్ వ్యూ’కు సమకూర్చుకుంది. పబ్లిక్ డేటాబేస్లు ఏకతాటిపైకి... ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించిన అరెస్టైన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లైసెన్స్, రేషన్‌కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. సమాచారం కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న వరకు పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి సదరు వ్యక్తి ‘పేర్లు’ మార్చుకున్నా ఆ వివరాలన్నింటికీ అందిస్తుంది. అదే విధంగా ఆ వ్యక్తి పేరుతో ఉన్న ఇతర వాహనాలు, సిమ్‌కార్డులు తదితరాలకు సంబంధించిన వివరాలనూ అందిస్తుంది. ఇందులో సెర్చ్ చేయడం ద్వారా రంగారెడ్డికి చెందిన కొంత కీలక సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంగ్రహించగలిగారు. మరో రెండు బ్యాంకులకు లేఖలు... కర్మన్‌ఘాట్‌లో షెల్ కంపెనీ ఏర్పాటు చేసిన రంగారెడ్డి అండ్ కో అందులో 41 మంది పని చేస్తున్న ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. వీటితో పాటు నకిలీ పత్రాలు, ధ్రువీకరణల ఆధారంగా నాలుగు బ్యాంకులకు క్రెడిట్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ నుంచి 48 కార్డులు తీసుకుని రూ.45.72 లక్షలు, ఎస్బీఐ నుంచి 33 కార్డులు తీసుకుని రూ.25.29 లక్షలు, స్టాండర్డ్ చార్టర్డ్ నుంచి 41 కార్డులు తీసుకుని రూ.77.9 లక్షలు, ఆర్బీఎల్ బ్యాంకు నుంచి 3 కార్డులు తీసుకుని రూ.3.26 లక్షలు స్వైపింగ్ ద్వారా కాజేశారు. లిమిట్ ముగిసే వరకు వాడేసి ఆపై కార్డుతో పాటు దానికి లింకు చేసిన సిమ్కార్డునీ పారేయడం ఈ నిందితుల నైజం. డిఫాల్ట్ అయిన కార్డుదారుల వివరాల కోసం ప్రయత్నించిన బ్యాంకు యాజమాన్యాల్లో రెండు ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయాయి. కేవలం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ మాత్రమే ఫిర్యాదు చేశాయి. మిగిలిన రెండు బ్యాంకులకూ అధికారిక సమాచారం ఇచ్చి వారూ ఫిర్యాదు చేసేలా చేయడానికి పోలీసు విభాగం లేఖలు రాస్తోంది. ‘అరుదైన’ నెలలోనే చిక్కాడు... 2013–2015 మధ్య రెండేళ్ళ పాటు స్కామ్ చేసి, ఆపై రెండేళ్ళకు పైగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డి ‘అరుదైన నెల్లో’నే చిక్కాడు. రంగారెడ్డి తన ఫేస్బుక్ పేజ్‌లో 2015 ఫిబ్రవరి 17న ఓ పోస్ట్ పెట్టారు. దీని ప్రకారం ఆ నెల అత్యంత అరుదైనదిగా అందులో పేర్కొన్నాడు. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి వారం నాలుగుసార్లు వస్తోందని, ఇలా 823 సంవత్సరాలకు ఓసారి జరుగుతుందని, అందుకే ఈ నెల అరుదైందని వ్యాఖ్యను జోడించారు. సీన్ కట్ చేస్తే 2018 వరకు పుట్టగొడుగు రైతు ముసుగులో అజ్ఞాతంలో ఉండిపోయిన రంగారెడ్డి ఫిబ్రవరి నెల్లోనే చిక్కాడు. బోగస్ వ్యక్తుల పేర్లు, నకిలీ చిరునామాలతో రంగారెడ్డి గ్యాంగ్ క్రెడిట్‌కార్డుల కోసం అప్లై చేసుకుంది. వాస్తవానికి వీటిని డెలివరీ చేసే కొరియర్ బాయ్స్ అధికారిక చిరునామాలోనే అందించాలి. అయితే వారినీ ప్రలోభాలకు గురి చేసిన రంగారెడ్డి తనకే డెలివరీ చేసేలా చేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు ఆయా కొరియర్ బాయ్స్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. -
శాడిస్టు భర్త నుంచి.. కాపాడిన కొరియర్ బోయ్
భర్తకు, ఆమెకు ఏం గొడవ జరిగిందో తెలియదు.. అతడు మాత్రం ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించినా.. జుట్టుపట్టుకుని ఈడ్చి లోపలకు లాక్కొచ్చి మళ్లీ చిత్రహింసలు పెట్టేవాడు. దాదాపు 15 గంటల పాటు ఆమెను దారుణంగా కొట్టి, లైంగికంగా వేధించాడు. ఇదంతా అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో గల ఫ్రాంక్లిన్ కౌంటీలో జరిగింది. తలకు తుపాకి గురిపెట్టి.. ఆమెను కాల్చి, తాను కూడా కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించాడు. అతగాడు ఇదంతా చేస్తున్న సమయంలో.. వాళ్ల మూడేళ్ల కొడుకు బెడ్రూంలో బందీగా ఉన్నాడు. ఆ 15 గంటల పాటు అతడికి తిండి కాదు కదా.. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక కొరియర్ బోయ్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఆ ఇంటి నుంచి ఓ ప్యాకేజి తీసుకోడానికి ఆ కొరియర్ బోయ్ వచ్చాడు. ఆమె అతడితో మాట్లాడుతుండగా.. ఆమె భర్త జేమ్స్ జోర్డాన్ తలుపు వెనక నుంచి ఆమె తలమీద తుపాకి గురిపెట్టి అక్కడే నిలబడ్డాడు. కష్టమ్మీద ఆమె ఆ బాక్సు మీద 'కాంటాక్ట్ 911' అని మాత్రం రాయగలిగింది. ఆ కొరియర్ బోయ్‌కి ఆ సందేశం అర్థమైంది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడంతా ఆ కొరియర్ బోయ్ని హీరో అని పొగుడుతున్నారు. అతడు ఫోన్ చేసి ఉండకపోతే ఈ కేసు విచారణ అస్సలు ముందుకు సాగేది కాదని ఫ్రాంక్లిన్ కౌంటీ పోలీసు అధికారి సార్జంట్ టీజీ వైల్డ్ చెప్పారు. అతడు పనిచేసే కంపెనీ కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తింది. అతడు తమవద్ద దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్నాడని, సందేశం చూసిన వెంటనే 911కు (మన దేశంలో 100 లాంటి నెంబర్) ఫోన్ చేయడంతో పోలీసులు తక్షణం స్పందించి ఆమెను శాడిస్టు భర్త బారి నుంచి కాపాడగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా... ఇంతకుముందు కూడా అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అప్పుడు కూడా ఒక మహిళ చాలా చిత్రమైన రీతిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమెను ఒక మొబైల్ ఇంట్లో ఒక వ్యక్తి నిర్బంధించి ఉంచాడు. అప్పుడామె తన కూతురికి ఒక కరెన్సీ నోటు ఇచ్చి, దాని మీద ఆ విషయాన్ని రాసిపెట్టింది. ఆ చిన్నారి ఆ నోటును స్కూలు అధికారులకు ఇవ్వడంతో వాళ్లు ఆ సందేశం చదివి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో బంధించినట్లు గమనించి, ఆమెను విడిపించారు. -
కొరియర్ బోయ్‌లా వచ్చి...
హైదరాబాద్: కొరియర్ బోయ్ అంటూ ఇంట్లోకి వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కుపోయాడో ఆగంతకుడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గదర్శి కాలనీ రోడ్డు నంబర్-6లోని శోభ(23) అనే మహిళ బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా కనిపెట్టిన ఓ దుండగుడు ఆ ఇంటి డోర్ బెల్ కొట్టి కొరియర్ అని చెప్పాడు. నిజమేననుకున్న శోభ బయటకు రావడంతో దుండగుడు ఆమె కళ్లలో కారంకొట్టి.. మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కుపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కొరియర్ బాయ్ స్వీట్ 80
చాలామంది ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే ఏదో కోల్పోయామంటూ.. ఇప్పుడేం చేయాలంటూ దిగాలు పడి పోతారు. కానీ, కొంతమంది అందుకు భిన్నం. రిటైర్ అయ్యాక కూడా కొత్త లైఫ్ కోరుకుంటారు. నవ జీవనానికి బాటలు వేసుకుంటారు. వయస్సు మీద పడినా కర్తవ్యానికి వెన్ను చూపరు. ఈ కోవలోకే వస్తారు విజయవాడకు చెందిన భట్లపెనుమర్రు రాజన్న పంతులు గారు. ఈ 80ఏళ్ల నవ యువకుడు చేస్తున్న పనేంటంటే.. మీరు ఏదైనా కార్యక్రమం తలపెట్టారా... మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతోందా... ఎవరికైనా అర్జెంట్‌గా ఉత్తరం లేదా శుభలేఖ అందించాలనుకుంటున్నారా... లేదా విలువైన పత్రాలు ఎవరికైనా అందజేయాలనుకుంటున్నారా... అయితే, ఒక్కసారి పంతులు గారికి ఫోన్ కొట్టాల్సిందే. కార్యక్రమం ఏదైనా.. వాటి తాలూకా ఆహ్వాన పత్రాలు అందజేయడం ఈయన నిత్యకృత్యం. మండుటెండలో సైతం సైకిల్‌పై బయల్దేరి ఆహ్వానాలు అందజేస్తారు. ఆయన తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నాకు ముగ్గురు పిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి సెటిల్ అయ్యారు. ఇప్పుడు నా వయసు ఎనిమిది పదులపైనే. నేను జీవిత భీమాలో పనిచేసి రిటైర్ అయ్యాను. సుమారు పాతికేళ్ల క్రితం 1992లో ‘జహన్ కొరియర్స్’ పేరున ఒక సంస్థను స్థాపించాను. ఇందులో ఉద్యోగులెవరూ ఉండరు. ప్రొప్రయిటర్ నుంచి బంట్రోతు వరకూ అన్నీ నేనే. ఎవరైనా స్థానికంగా ఆహ్వాన పత్రాలు అందజేయాలంటే సహాయపడతాను. ఉదయం పది గంటలకు సైకిల్‌పై బయల్దేరుతాను. తిరిగి రాత్రి పది గంటలకు ఇల్లు చేరతాను. విలువైన సమయాన్ని వృథా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నాకు చేతనైన పనిచేస్తున్నాను. నగరంలోని ప్రముఖుల పేర్లు ఎన్నో నా దగ్గర ఉన్నాయి. ఆ చిరునామాలను నిర్వాహకులకు చూపిస్తాను. వారికి అవసరమైన వారి పేర్లను వారు టిక్ చేస్తారు. కార్డుకు రూ.3 చొప్పున వసూలు చేస్తాను. కనీసం రూ.100 ఉండాలి. నా నంబరు 92467 46488. ఏదైనా పనిచేయాలనే.. ఆహ్వాన పత్రాలు కొరియర్లో ఇవ్వాలంటే కార్డుకు కనీసం పదిహేను రూపాయలు వసూలు చేస్తారు. నేను కేవలం రూ.3 మాత్రమే వ సూలు చేస్తాను. రోజుకు సుమారు 100 కార్డులు బట్వాడా చేస్తాను. నేను కేవలం సైకిల్‌పై పనులు నిర్వర్తిస్తున్నాను. నా సేవలను గుర్తించిన స్థానిక సుమధుర సంస్థ నన్ను సత్కరించి కొత్త సైకిల్ బహూకరించింది. ఎండావానను లెక్కచేయను. ఏ పనీ చేయకపోతే నాకు తోచదు. ఇప్పుడు పెద్దవాడిని కావడం వల్ల రోజూ కార్డులు పంచే సంఖ్య తక్కువైంది. -
లవర్ బాయ్ కాదు - కొరియర్ బాయ్
-
ఫుల్ రొమాన్స్...
మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా, ప్రేమకథల వైపు ఎప్పుడైతే దష్టి సారించారో... అప్పట్నుంచీ నితిన్ కెరీర్ సూపర్స్పీడ్ అందుకుంది. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు నితిన్. త్వరలో రాబోతున్న ఆయన సినిమా.. ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ కూడా ప్రేమకథే కావడం గమనార్హం. ఇప్పుడు అదే ఊపుతో మరో ప్రేమకథకు పచ్చజెండా ఊపారు నితిన్. ప్రేమకథలు తీయడంలో సిద్ధహస్తునిగా పేరుగాంచిన కరుణాకరన్ దర్శకత్వంలో ఫుల్ రొమాన్స్ చేయబోతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలీవుడ్ కథానాయిక మిస్తీ ఇందులో హీరోయిన్. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి. ఇష్క్, గుండెజారి... తర్వాత తాము నిర్మిస్తున్న మూడో సినిమా ఇదని, జూన్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి మన దేశంలోనూ, విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతామని, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్.