‘అరుదైన’ నెలలోనే చిక్కాడు... | new software helps in crime cases | Sakshi
Sakshi News home page

పేరు మార్చినా పట్టేస్తారు..!

Published Sat, Feb 24 2018 7:37 AM | Last Updated on Sat, Feb 24 2018 11:44 AM

new software helps in crime cases - Sakshi

రంగారెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: షెల్‌ కంపెనీ ఏర్పాటు చేసి బోగస్‌ వ్యక్తుల పేర్లతో క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం ద్వారా రెండేళ్లల్లో నాలుగు బ్యాంకులను  రూ.1.52 కోట్లకు ముంచిన కుంభం రంగారెడ్డిని పట్టుకోవడంలో నగర పోలీసు విభాగం సమీకరించుకున్న ‘360 డిగ్రీస్‌ వ్యూ’ సాఫ్ట్‌వేర్‌ ఎంతగానో ఉపకరించింది. ఇందులో కేసుల దర్యాప్తునకు ఉపకరించే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మరోపక్క రంగారెడ్డి కేసుకు సంబంధించి కొందరు కొరియర్‌ బాయ్స్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గురువారం చిక్కిన ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో రెండు బ్యాంకులకు అధికారిక సమాచారం ఇచ్చేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. 

‘పేర్లు’ మారుస్తూ తప్పుదారి...
నగర పోలీసు గడిచిన కొన్నాళ్లుగా ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ను విస్త్రృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీనిని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరసగా నేరాలు చేసే నేరగాళ్ళలో కొందరు, ఆర్థిక నేరాలకు పాల్పడి అజ్ఞాతంలోకి వెళ్ళిన వారు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓసారి అరెస్టు అయినప్పుడు ఇంటి పేరు ముందు, అసలు పేరు వెనుక చెబుతూ, మరోసారి అరెస్టు అయిన సందర్భంలో పేరు ముందు, ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇలాంటి మార్పు చేర్పులతోనే తమ గుర్తింపును సైతం మార్చేసుకుంటున్నారు. 

స్పెల్లింగ్స్‌లో మార్పుచేర్పులు చేస్తూ...
ఇలాంటి ‘మార్పిడిగాళ్ళు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టైన ప్రతిసారీ బెయిల్‌ పొందడం కోసం న్యాయస్థానంలో, ఇతర సదుపాయాల కోసం ఆయా విభాగాల దగ్గర ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్‌ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే  పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టు అయినప్పుడు చివరి స్పెల్లింగ్‌ (వైవైఏ) అంటూ, మరోసారి చిక్కినప్పుడు దీన్ని (ఐఏహెచ్‌)గా రాస్తూ బురిడీ కొట్టిస్తుంటారు. ఈ తరహా కేటుగాళ్ళ సంఖ్య పెరిగినట్లు తేలడంతో పోలీసు విభాగం ‘360 డిగ్రీస్‌ వ్యూ’కు సమకూర్చుకుంది. 

పబ్లిక్‌ డేటాబేస్‌లు ఏకతాటిపైకి...
ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించిన అరెస్టైన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌కార్డ్, ఓటర్‌ గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. సమాచారం కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్‌’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న వరకు పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ వీటన్నింటినీ సెర్చ్‌ చేసి సదరు వ్యక్తి ‘పేర్లు’ మార్చుకున్నా ఆ వివరాలన్నింటికీ అందిస్తుంది. అదే విధంగా ఆ వ్యక్తి పేరుతో ఉన్న ఇతర వాహనాలు, సిమ్‌కార్డులు తదితరాలకు సంబంధించిన వివరాలనూ అందిస్తుంది. ఇందులో సెర్చ్‌ చేయడం ద్వారా రంగారెడ్డికి చెందిన కొంత కీలక సమాచారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంగ్రహించగలిగారు. 

మరో రెండు బ్యాంకులకు లేఖలు...
కర్మన్‌ఘాట్‌లో షెల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన రంగారెడ్డి అండ్‌ కో అందులో 41 మంది పని చేస్తున్న ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశారు. వీటితో పాటు నకిలీ పత్రాలు, ధ్రువీకరణల ఆధారంగా నాలుగు బ్యాంకులకు క్రెడిట్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెడ్‌డీఎఫ్‌సీ నుంచి 48 కార్డులు తీసుకుని రూ.45.72 లక్షలు, ఎస్బీఐ నుంచి 33 కార్డులు తీసుకుని రూ.25.29 లక్షలు, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ నుంచి 41 కార్డులు తీసుకుని రూ.77.9 లక్షలు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి 3 కార్డులు తీసుకుని రూ.3.26 లక్షలు స్వైపింగ్‌ ద్వారా కాజేశారు. లిమిట్‌ ముగిసే వరకు వాడేసి ఆపై కార్డుతో పాటు దానికి లింకు చేసిన సిమ్‌కార్డునీ పారేయడం ఈ నిందితుల నైజం. డిఫాల్ట్‌ అయిన కార్డుదారుల వివరాల కోసం ప్రయత్నించిన బ్యాంకు యాజమాన్యాల్లో రెండు ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయాయి. కేవలం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే ఫిర్యాదు చేశాయి. మిగిలిన రెండు బ్యాంకులకూ అధికారిక సమాచారం ఇచ్చి వారూ ఫిర్యాదు చేసేలా చేయడానికి పోలీసు విభాగం లేఖలు రాస్తోంది.

‘అరుదైన’ నెలలోనే చిక్కాడు...
2013–2015 మధ్య రెండేళ్ళ పాటు స్కామ్‌ చేసి, ఆపై రెండేళ్ళకు పైగా అజ్ఞాతంలో ఉన్న రంగారెడ్డి ‘అరుదైన నెల్లో’నే చిక్కాడు. రంగారెడ్డి తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో 2015 ఫిబ్రవరి 17న ఓ పోస్ట్‌ పెట్టారు. దీని ప్రకారం ఆ నెల అత్యంత అరుదైనదిగా అందులో పేర్కొన్నాడు. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి వారం నాలుగుసార్లు వస్తోందని, ఇలా 823 సంవత్సరాలకు ఓసారి జరుగుతుందని, అందుకే ఈ నెల అరుదైందని వ్యాఖ్యను జోడించారు. సీన్‌ కట్‌ చేస్తే 2018 వరకు పుట్టగొడుగు రైతు ముసుగులో అజ్ఞాతంలో ఉండిపోయిన రంగారెడ్డి ఫిబ్రవరి నెల్లోనే చిక్కాడు. బోగస్‌ వ్యక్తుల పేర్లు, నకిలీ చిరునామాలతో రంగారెడ్డి గ్యాంగ్‌ క్రెడిట్‌కార్డుల కోసం అప్‌లై చేసుకుంది. వాస్తవానికి వీటిని డెలివరీ చేసే కొరియర్‌ బాయ్స్‌ అధికారిక చిరునామాలోనే అందించాలి. అయితే వారినీ ప్రలోభాలకు గురి చేసిన రంగారెడ్డి తనకే డెలివరీ చేసేలా చేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు ఆయా కొరియర్‌ బాయ్స్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement