శాడిస్టు భర్త నుంచి.. కాపాడిన కొరియర్ బోయ్ | courier boy saves woman from her sadist husband in missouri | Sakshi
Sakshi News home page

శాడిస్టు భర్త నుంచి.. కాపాడిన కొరియర్ బోయ్

Published Tue, Dec 13 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

శాడిస్టు భర్త జేమ్స్ జోర్డాన్

శాడిస్టు భర్త జేమ్స్ జోర్డాన్

భర్తకు, ఆమెకు ఏం గొడవ జరిగిందో తెలియదు.. అతడు మాత్రం ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించినా.. జుట్టుపట్టుకుని ఈడ్చి లోపలకు లాక్కొచ్చి మళ్లీ చిత్రహింసలు పెట్టేవాడు. దాదాపు 15 గంటల పాటు ఆమెను దారుణంగా కొట్టి, లైంగికంగా వేధించాడు. ఇదంతా అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో గల ఫ్రాంక్లిన్ కౌంటీలో జరిగింది. తలకు తుపాకి గురిపెట్టి.. ఆమెను కాల్చి, తాను కూడా కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించాడు. అతగాడు ఇదంతా చేస్తున్న సమయంలో.. వాళ్ల మూడేళ్ల కొడుకు బెడ్రూంలో బందీగా ఉన్నాడు. ఆ 15 గంటల పాటు అతడికి తిండి కాదు కదా.. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక కొరియర్ బోయ్ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. 
 
ఆ ఇంటి నుంచి ఓ ప్యాకేజి తీసుకోడానికి ఆ కొరియర్ బోయ్ వచ్చాడు. ఆమె అతడితో మాట్లాడుతుండగా.. ఆమె భర్త జేమ్స్ జోర్డాన్ తలుపు వెనక నుంచి ఆమె తలమీద తుపాకి గురిపెట్టి అక్కడే నిలబడ్డాడు. కష్టమ్మీద ఆమె ఆ బాక్సు మీద 'కాంటాక్ట్ 911' అని మాత్రం రాయగలిగింది. ఆ కొరియర్ బోయ్‌కి ఆ సందేశం అర్థమైంది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడంతా ఆ కొరియర్‌ బోయ్‌ని హీరో అని పొగుడుతున్నారు. అతడు ఫోన్ చేసి ఉండకపోతే ఈ కేసు విచారణ అస్సలు ముందుకు సాగేది కాదని ఫ్రాంక్లిన్ కౌంటీ పోలీసు అధికారి సార్జంట్ టీజీ వైల్డ్ చెప్పారు. అతడు పనిచేసే కంపెనీ కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తింది. అతడు తమవద్ద దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్నాడని, సందేశం చూసిన వెంటనే 911కు (మన దేశంలో 100 లాంటి నెంబర్) ఫోన్ చేయడంతో పోలీసులు తక్షణం స్పందించి ఆమెను శాడిస్టు భర్త బారి నుంచి కాపాడగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
గతంలో కూడా...
ఇంతకుముందు కూడా అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అప్పుడు కూడా ఒక మహిళ చాలా చిత్రమైన రీతిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమెను ఒక మొబైల్ ఇంట్లో ఒక వ్యక్తి నిర్బంధించి ఉంచాడు. అప్పుడామె తన కూతురికి ఒక కరెన్సీ నోటు ఇచ్చి, దాని మీద ఆ విషయాన్ని రాసిపెట్టింది. ఆ చిన్నారి ఆ నోటును స్కూలు అధికారులకు ఇవ్వడంతో వాళ్లు ఆ సందేశం చదివి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో బంధించినట్లు గమనించి, ఆమెను విడిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement