నాగోలు: కొరియర్ ఉందని చెప్పి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు దుండగులు వృద్ధురాలిని బాత్‌రూంలో బంధించి అమె ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో దోపిడీకి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10. 5 తులాల బంగారం, రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపిన మేరకు.. సచివాలయనగర్‌లో వెంకటనర్సమ్మ (84)నివాసం ఉంటోంది.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేలపూడి సురేష్‌కుమార్(31) మాన్సూరాబాద్ బేతస్ధ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాకు చెందిన పరమిజిత్‌సింగ్ (43) నగరంలో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు పాత నేరస్తులు దొంగతనం కేసులో 2016లో జైలుకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో వనస్ధలిపురం సచివాలయనగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్న వెంకటనర్సమ్మను వీరు గమనించారు. గత నెల 26న తేదీ కొరియర్ వచ్చిందని చెప్పి వెంకటనర్సమ్మ ఇంట్లోకి వెళ్లారు.
అమెను బెదిరించి బాత్ రూమ్‌లో బంధించి ఆమె దగ్గర ఉన్న 10 తులాల బంగారం, 50 వేల నగదు తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఇంజాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నిందితులు హోండా యాక్టివాపై వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని ఆపి డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించారు. నిందితులు పత్రాలు చూపించకుండా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదు, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు వనస్ధలిపురం డబుల్ బెడ్ రూమ్ పార్కింగ్ వద్ద యాక్టివాను చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరినీ విచారణ చేయగా గతంలో వీరిపైన వనస్థలిపురం, పటన్‌చెరువు, నాందేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భీమ్‌రెడ్డి, సీఐ జలేందర్‌రెడ్డి, డిఐ వెంకట్, ఎస్‌ఐ నర్సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment