ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలకు హాజరుకావడం లేదని,పుస్తకాలు తీసుకురావడం లేదని మందలించినందుకు టీచర్‌పై ఎనిమిదో తరగతి విద్యార్థి ఇనుప కడ్డీతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన టీచర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సాకేత్ ప్రాంతంలోని వీర్ చందర్ సింగ్ గర్హేల్ ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది రోజులుగా స్కూల్‌కు హాజరు కానందుకు ఎనిమిదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ చౌధరి మందలించారు. విద్యార్థి బ్యాగ్‌ను పరిశీలించిన శ్యామ్ సుందర్‌కు అందులో ఇనుప రాడ్ కనిపించడంతో తీవ్రంగా మందలించి తన టేబుల్‌పై దాన్ని ఉంచారు.
మరోసారి ఇనుప కడ్డీని విద్యార్థి తన బ్యాగ్‌లో వేసుకోవడంతో ఆగ్రహించిన టీచర్ దాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, విద్యార్థి ఇనుప రాడ్‌తో దాడికి తెగబడ్డాడు. విద్యార్థి దాడితో టీచర్ కన్ను, చెవు, తలపై గాయాలయ్యాయి. దాడి అనంతరం స్కూల్ ప్రహరీ గోడను దూకి నిందితుడు పారిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విద్యార్థి దాడి చేసేందుకు సిద్ధమై స్కూల్‌కు వచ్చాడని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment