కుమారుడి మృతితో శోక సంద్రంలో మునిగిన తల్లి రామలక్ష్మి , రెడ్డి ఎర్నినాయుడు(ఫైల్)
పరవాడ(పెందుర్తి): విధి ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడుతుందో అంతుచిక్కదు. ఆ విధి కర్కశానికి ఓ విద్యార్థి బలైపోయాడు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. హృదయవిదారకరమైన ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ గ్రామానికి చెందిన రెడ్డి వెంకునాయుడు, రామలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రెడ్డి ఎర్నినాయుడు(17) రాజమహేంద్రవరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నికల్ (జీఎంఆర్) కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి గత శుక్రవారం తల్లిదండ్రులను చూడడానికి వచ్చి స్నేహితులతో రెండు రోజులు సరదాగా గడిపాడు. సోమవారం కాలేజీకి వెళ్లడానికి ఉదయం 6 గంటలకు పరవాడలో బయలుదేరాడు. కూర్మన్నపాలెం నుంచి ఆటోపై దువ్వాడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరానికి వెళ్లడానికి టిక్కెటు కొనుక్కొని రైలు ఎక్కుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణించాడని సమాచారం తెలియగానే తల్లిదండ్రులు వెంకునాయుడు, రామలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చదువులో ఎప్పుడూ మంచి మార్కులు సాధించేవాడని, మరో ఆరు నెలల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న తరుణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తండ్రి వెంకునాయుడు రోదిస్తున్న తీరు చూపరులను కలిచి వేస్తోంది. ఎదిగొచ్చిన కొడుకును ఆ భగవంతుడు దూరం చేశాడని భోరున విలపిస్తున్నాడు. స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న వెంకునాయుడుకు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు రాజేష్ ఇంటర్ చదువుతున్నాడు. అందరితో సరదాగా గడిపే ఎర్నినాయుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కొడుకు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను గ్రామస్తులు, పలువురు నాయకులు పరామర్శించి సంతాపం తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment