రైలు నుంచి విద్యార్థి తోసివేత  | Student Injuries Falling Off a Train Gutti | Sakshi
Sakshi News home page

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

Published Tue, Aug 27 2019 8:29 AM | Last Updated on Tue, Aug 27 2019 8:31 AM

Student Injuries Falling Off a Train Gutti - Sakshi

సాక్షి, గుత్తి(అనంతపురం) : రైల్లోంచి ఇంటర్‌ విద్యార్థిని గుర్తుతెలియని ప్రయాణికుడు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయాడు. జక్కలచెరువు రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. జీఆర్పీ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మైన్స్‌ వ్యాపారి రాజేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్‌రెడ్డి విజయవాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ సెకడియర్‌ చదువుతున్నాడు. తల్లిదండ్రులను చూడాలని విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో తాడిపత్రికి బయల్దేరాడు. గాఢ నిద్రలో ఉండటంతో తాడిపత్రిలో దిగలేదు. జక్కల చెరువు రైల్వే స్టేషన్‌లో రైలు వెళ్తున్న సమయంలో లేచి ఏ ఊరో తెలుసుకోవాలని డోర్‌ దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిందకు తోసేశాడు.

దీంతో నిరంజన్‌రెడ్డి రెండు కాళ్లు రైలు చక్రాల కింద పడ్డాయి. దీంతో రెండు కాళ్లు కట్‌ అయ్యాయి. సమీపంలోని వారు వెంటనే స్పందించి కట్‌ అయిన కాళ్లను ఓ సంచిలో వేసుకుని నిరంజన్‌రెడ్డిని 108 వాహనంలో  హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సీనియర్‌ నాయకులు పేరం నాగిరెడ్డి హుటాహుటిన గుత్తికి వచ్చి నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుత్తి జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాములు నాయక్, పీసీ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement