
రవితేజ (ఫైల్), మహేందర్ (ఫైల్)
జగిత్యాల క్రైం: విద్యార్థుల ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఓ ప్రేమ కథతో రూపొందించిన సినిమాను ప్రేరణగా తీసుకొని.. తామూ ఆత్మహత్య చేసుకుని ప్రియురాళ్ల మనస్సులో చిరకాలం నిలిచిపోదామని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. జగిత్యాలలో ఆదివారం రాత్రి పదో తరగతి చదువుతున్న మహేందర్, రవితేజ ఆత్మహత్యకి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను జిల్లా ఎస్పీ సింధూశర్మ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ ప్రకాశ్ చనిపోయిన ఇద్దరు విద్యార్థుల స్నేహితులను విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది.
ఈ ఇద్దరు విద్యార్థులు ఏడాది కాలంగా అదే పాఠశాలకు చెందిన ఇద్దరమ్మాయిలతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ.. చాటింగ్‌లు చేస్తూ ఉండేవారు. ఈ మేరకు సినిమాల ప్రేరణతో ఇద్దరు బాలురు ప్రియురాళ్ల కోసం ప్రాణం తీసుకున్నట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. ఇటీవల విడుదలైన ఆర్‌ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ కోసం హీరో పాట పాడుతూ ప్రాణత్యాగం చేసుకుంటాడని, ఆ సంఘటనను ప్రేరణగా తీసుకుని తాము కూడా అలాగే ఆత్మహత్య చేసుకుంటామని మహేందర్ తన మిత్రుడు అజీజ్‌కు చెప్పినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. చనిపోయిన విద్యార్థులు గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైనట్లు తేలిందని, పథకం ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి ఇద్దరూ కలసి బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి.. కలిసే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని వెంకటరమణ పేర్కొన్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కాగా, జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలాన్ని ఎస్పీ సింధూశర్మ సోమవారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె వెంట పట్టణ సీఐ ప్రకాశ్, ఎస్సై ప్రసాద్, రాములు ఉన్నారు.
రెండు కుటుంబాల్లో విషాదం
అల్లారుముద్దుగా పెంచుతూ.. కొడుకులను ప్రయోజకులను చేయాలని కలలు కన్న తల్లిదండ్రులకు ఆ కొడుకులు శోకాన్నే మిగిల్చారు. విద్యార్థుల మృతితో రెండు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన కూసరి రవి, లత రెండో కుమారుడు మహేందర్, విద్యానగర్‌కు చెందిన శ్యామల కుమారుడు రవితేజ ఆత్మహత్యతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సోమవారం కుటుంబసభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment