క్రాంతికుమార్(ఫైల్)
కర్నూలు: తాము అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా హామీ ఇచ్చారు. అధికారంలో రాగానే హామీలకు పాతరేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వడం తన బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల నిరుద్యోగ యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినా కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం రాలేదన్న బెంగతో కర్నూలు జిల్లా కల్లూరులో ఓ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు.
కల్లూరులోని పీవీ నరసింహారావునగర్‌లో నివాసం ఉంటున్న పెద్ద చెన్నయ్య కుమారుడు క్రాంతి కుమార్ (23) డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపించకపోవడంతో లా కోర్సు చేయాలని భావించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం ఎలుకల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రాంతి కుమార్ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఉద్యోగం రాక, తల్లిదండ్రులపై ఆధారపడి జీవించడం ఇష్టం లేకనే బాధితుడు ఎలుకల మందు తాగినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్‌ఐ శేషయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment