
డ్రైవర్‌కు పరీక్షలు చేస్తున్న వైద్యులు
టెక్కలి రూరల్ : వడదెబ్బకు గురైన ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంతో బస్సును నిలిపి ఆయన స్పృహ కోల్పోయారు. దీంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం సోమవారం వెళుతోంది.
బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో డ్రైవర్ ఎం.డి ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నాయని గుర్తించిన ఆయన.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని భావించి బస్సును నెమ్మది చేస్తూ టెక్కలి సమీపంలోని రహదారి పక్కన నిలిపివేసి ఒక్కసారిగా కిందకు పడిపోయారు.
ఇది గమనించిన కండక్టర్.. డ్రైవర్ ఇలియాస్‌ను హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహరాజ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన డైవ్రర్‌ను ప్రయాణికులు అభినందించారు.