
తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న దిలీప్.. ఆ నాడు నటిని కిడ్నాప్ చేసేందుకు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని విచారణ అధికారులు బుధవారం హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ముఖ్య నిందితుడైన పల్సర్ సునీకి రూ.1.50కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, ఒక వేళ పోలీసులు పట్టుకుంటే మాత్రం రూ.3కోట్లు చెల్లించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ ఏడాది జులైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ నటిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేసేలా ప్లాన్ చేశారని, కుట్రపూరిత నేరం కేసులో ఆయనను అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం హైకోర్టులో దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. గతంలో రెండుసార్లు కింది స్థాయి కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది.