అనుమానితుడు అష్రాఫ్
శ్రీకాకుళం: జిల్లాలోని కంచిలి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన వ్యక్తి ఐఎస్‌ఐ ఏజెంటేనా అనే విషయమై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి జిల్లాలో ప్రవేశించాడని, అతను ఐఎస్‌ఐ ఏజెంట్ అయి ఉండవచ్చని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అజ్ఞాత వ్యక్తి పోలీసు నిఘా వర్గాలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ రాష్ట్రంలోకి ప్రవేశించాడని చెబుతూ అతనికి చెందిన సెల్ నెంబర్‌ను పోలీసులకు తెలియజేశాడు. ఆ నెంబర్‌ను ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రేస్ చేయడం ప్రారంభించాయి. అ ప్పటికే అతను శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించినట్లు కొనుగొన్నారు. జిల్లా పోలీసులను అప్రమత్తం చేశా రు.
పోలీసులు రణస్థలం, చిలకపాలెం, మడపాం, టెక్కలి, పలాస, ఇలా.. ఇచ్ఛాపురం వరకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. పోలీసులు కార్లు, జీపులు వంటి వాటిపైనే దృష్టి పెట్టడంతో పలాస వరకు తప్పించుకోగలిగాడు. అటు తరువాత లారీలను సైతం తనిఖీలు చేయాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ఆ పనిలో పడ్డారు. దీంతో కంచిలి వద్ద ఓ లారీలో వెళుతున్న అష్రాఫ్ సయ్యద్ అనే వ్యక్తి వద్ద పోలీసులకు అందిన సెల్ నెంబర్ ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే లారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అష్రాఫ్ చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందినవాడుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటన గురించి పెదవి విప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment