లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం ఆగ్రాకు సమీపంలోని ఫతేపూర్ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువ జంటపై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దాడిలో పాల్గొన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని లాసన్నేకు చెందిన క్వెంటిన్ జెర్మీ క్లెర్క్(24) తన స్నేహితురాలు మేరీ డ్రోజ్(24)తో కలసి సెప్టెంబర్ 30న భారత్ వచ్చారు.
ఈ నెల 21న ఆగ్రా సందర్శించిన వారు 22వ తేదీన ఫతేపూర్ సిక్రీకి వెళ్లారు. ఆ సమయంలో వీరిని రైల్వేస్టేషన్ నుంచి ఐదుగురు యువకులు అనుసరిస్తూ వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గాయపడిన క్లెర్క్, డ్రోజ్ నడిరోడ్డుపైనే రక్తపుమడుగులో పడిపోయారు. స్థానికులు 100కి డయల్ చేసి సమాచారం అందించడంతో బాధితులను ఆగ్రాలోని ఆస్పత్రికి తరలించారు. స్విస్ జంటపై దాడి భారత ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని పేర్కొంటూ ఆయన ఉత్తరప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. బాధ్యులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment