
సిడ్నీ: తన భార్యను, రెండు నెలల కూతురును భారత్‌కు అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఓ ఆస్ట్రేలియన్ పౌరుడికి జైలు పన్నెండేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వాస ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా పేర్కొంటూ మరో ఐదేళ్ల శిక్షను వేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ లోహన్ అనే ఆస్ట్రేలియన్ పౌరుడు లిడ్‌కాంబే నగరంలో తన భార్య, రెండు నెలల కూతురుతో నివాసం ఉంటున్నాడు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి భారత్‌కు చెందిన తన భార్యను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
అక్రమంగా ఆమెను అక్కడి నుంచి తరలించాలని భావించాడు. మే నెలలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులను కలిసి తన భార్య కూతురు భారత్‌కు చేరుకోగానే వీసా రద్దు చేయాలని కోరాడు. అలాగే, తన పాప వీసాను కూడా రద్దు చేయించాడు. వారిద్దరిని అక్రమంగా భారత్‌కు తరలించి మోసం చేయాలని కుట్ర పన్నాడు. దీంతో అతడి తీరును అనుమానించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు, మనుషుల అక్రమ రవాణ నిర్మూలన విభాగం అధికారులు చివరికి అతడిని అరెస్టు చేసి కోర్టుకు అప్పగించారు. ప్రస్తుతం అతడి భార్య, కూతురు ఆస్ట్రేలియా పోలీసుల సంరక్షణలో ఉన్నారు.