
జగ్గయ్యపేట: సీజ్ చేసిన ఇసుక లారీలకు రిలీజ్ ఆర్డర్ వచ్చినప్పటికీ కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట తహసీల్దార్ వాటిని వదలకుండా, తన సొంత అవసరాల కోసం తెలంగాణ తరలిస్తుండగా గరికపాడు చెక్‌పోస్ట్ ఆర్టీఏ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 13న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లిలోని కస్తాల సమీపంలోని కృష్ణానది నుంచి మూడు లారీల్లో అక్రమంగా ఇసుకను తెలంగాణ తరలిస్తుండగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు లారీలు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన లారీలకు శుక్రవారం కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట తహసీల్దార్ బి.చంద్రశేఖర్ స్వయంగా స్టేషన్‌కు వచ్చి రిలీజ్ ఆర్డర్ కాపీలను తీసుకొని లారీల్లో ఉన్న ఇసుకను తన కార్యాలయంలో అన్‌లోడ్ చేస్తానని చెప్పి వాహనాలను తీసుకెళ్లారు. అయితే ఆ ఇసుకను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని తన ఇంటి నిర్మాణానికి చిల్లకల్లు మీదుగా అనుమంచిపల్లికి జానకిరామయ్య అనే ట్రాన్స్‌పోర్ట్ ఏజెంట్ ద్వారా పంపించారు. అనుమంచిపల్లి గ్రామానికి 50 మీటర్ల దూరంలో ఆర్టీఏ చెక్‌పోస్టు ఉండడంతో లారీలను నిలిపివేసి తహసీల్దార్‌కు సమాచారమిచ్చారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ చెల్లారావు ఆ లారీలను గమనించి డ్రైవర్లను వివరాలు అడిగారు. తెలంగాణ తీసుకెళ్తున్నామని డ్రైవర్లు సమాచారమివ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు.
తహసీల్దార్ ప్రమేయంతోనే..
మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన లారీలను తహసీల్దార్ ప్రమేయంతో తెలంగాణలోని సూర్యాపేట తరలించేందుకు ప్రయత్నించారని జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు స్టేషన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 లారీలకు రిలీజ్ ఆర్డర్ వచ్చిందని తహసీల్దార్ చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లారన్నారు. తహసీల్దార్‌తో పాటు డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఏజెంట్‌పై కేసు నమోదు చేశామన్నారు. దీనిపై తహసీల్దార్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇసుకకు కొరత లేదని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు.
తహసీల్దార్‌కు చార్జిమెమో జారీ
తహసీల్దార్ చంద్రశేఖర్‌కు చార్జిమెమో జారీ చేస్తూ కలెక్టర్ లక్ష్మీకాంతం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తహసీల్దార్‌పై చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.