కర్నూలులోని సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, కర్నూలు : ఆయన రూటే సప‘రేటు’. ఆలోచనే భారీ ‘రేటు’. ఎక్కడ చేయి చాపినా కాసుల పంట పండాల్సిందే. ఏ ఫైలు ముట్టుకున్నా ‘ఆదాయం’ కళ్ల జూడాల్సిందే. లేదంటే ఆయన మనసొప్పదు. ఎవరి ఫైళ్లు అయినా నిలబెట్టేస్తాడు. తనను రహస్యంగా కలవాలని ఆదేశిస్తాడు. అడిగినంత సమర్పించుకుంటేనే పని అవుతుంది. లేదంటే అంతే సంగతి! ప్రస్తుతం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరాల సంజీవరెడ్డి తీరిది. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు సెర్చ్ వారెంట్‌తో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు శ్రీధర్, గౌతమి, తేజేశ్వరరావు తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి సంజీవరెడ్డి నివాసముంటున్న కర్నూలు ధనలక్ష్మి నగర్‌తో పాటు అత్తమామల స్వగ్రామమైన వెలుగోడు మండలం మోతుకూరులో ఏకకాలంలో సోదాలు చేశారు.
నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు
ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు పది చోట్ల స్థలాలు, రెండు చోట్ల బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు...ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నకొద్దీ ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల తలుపులు మూసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా దొరికిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దస్తావేజుల ప్రకారం దాదాపు రూ.రెండు కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేసుకున్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సంజీవరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. కేసు పరిశోధన కొనసాగుతోందని డీఎస్పీ నాగభూషణం వెల్లడించారు. సంజీవరెడ్డి ఉద్యోగ జీవితానికి సంబంధించి లోతుగా చూస్తే అనేక చీకటి కోణాలు కన్పిస్తున్నాయి.
విధుల్లో చేరినప్పటి నుంచే..
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి సంజీవరెడ్డి స్వగ్రామం. తండ్రి నరాల స్వామిరెడ్డి కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామ మునసబ్æగా పనిచేస్తూ మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద సంజీవరెడ్డికి 1997లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆత్మకూరు మండలం వెంకటాపురం, జూపాడుబంగ్లా మండలం తూడిచర్ల గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ)గా పనిచేశారు. అప్పటినుంచే అక్రమార్జనే పరమావధిగా అడుగులేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి వరకు చదువుకున్న ఈయన ఉద్యోగంలో పదోన్నతి కోసం ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2002లో పదోన్నతి పొంది.. 2011 వరకు వీఆర్‌వోగా కొత్తపల్లి, జూపాడుబంగ్లా, ఆత్మకూరు మండలాల్లో విధులు నిర్వర్తించారు. 2011లో జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కలెక్టరేట్‌లో కొంత కాలం పనిచేశారు. అలాగే 2012లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది కలెక్టరేట్‌లోనే పనిచేశారు. ఆ తర్వాత కర్నూలు ఆర్‌ఐగా మూడేళ్ల పాటు, కల్లూరు ఆర్‌ఐగా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. ఈ çసమయంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే వ్యాపారులతో కుమ్మకై భారీగా సొమ్ము చేసుకున్నట్లు విమర్శలున్నాయి. అక్రమ ఆదాయం విషయంలో అప్పటి కర్నూలు వీఆర్‌వో శ్రీనివాసరెడ్డితో విభేదాలు తలెత్తి.. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కొత్తపల్లిలో 15 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని చట్టబద్ధం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆస్తులపైనే వెచ్చింపు..
సంజీవరెడ్డి అక్రమార్జన సొమ్మును భూములు, ఇళ్లపైనే వెచ్చించినట్లు తెలుస్తోంది. కర్నూలుతో పాటు స్వస్థలం కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు, ఇంటిస్థలాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ సోదాల్లో లభించిన పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.
ఏసీబీ అధికారులు గుర్తించిన సంజీవరెడ్డి ఆస్తుల చిట్టా
⇒ కర్నూలు నగరం ధనలక్ష్మినగర్‌లో 5.5సెంట్ల విస్తీర్ణంలో అధునాతన జీ ప్లస్2 భవనం. సమీపంలోనే భార్య పేరుతో 5.50 సెంట్ల ఇంటి స్థలం.
⇒ 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు, కర్నూలు మండలం పసుపలగ్రామంలో 5సెంట్ల ఇంటి స్థలం, మండల కేంద్రం కొత్తపల్లిలో రెండు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటిస్థలానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి పరుల ఆట కట్టిస్తాం
లంచం తీసుకునే, ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకునే ఏ ఒక్కరినీ వదలబోం. అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మావంతు ముందడుగు ఉంటుంది. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధైర్యంగా సమాచారం ఇచ్చినçప్పుడే అవినీతిపరులకు కళ్లెం వేయగలం. లంచం తీసుకునేందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా భయపడే పరిస్థితులు రావాలి. ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుంది.
– ఏసీబీ డీఎస్పీ నాగభూషణం
Comments
Please login to add a commentAdd a comment