మరో మరణం | Tamil Nadu TN medico ends life in Chandigarh | Sakshi
Sakshi News home page

మరో మరణం

Published Wed, Feb 28 2018 9:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

Tamil Nadu TN medico ends life in Chandigarh - Sakshi

తల్లిదండ్రులతో కృష్ణప్రసాద్‌

ఉన్నత చదువుల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమిళ విద్యార్థులకు భద్రత కొరవడుతోంది. వరుస ఘటనలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా వైద్య కోర్సుల్ని అభ్యషించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాలు మిస్టరీలుగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో ఘటనలు చోటుచేసుకోగా, ›ప్రస్తుతం చండీఘర్‌లో తమిళ విద్యార్థి బలయ్యాడు.  

సాక్షి, చెన్నై: ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్య కళాశాల, ఆ కళాశాల పరిధిలోని ఇతర కళాశాలల్లో తమిళ విద్యార్థులు వైద్య కోర్సుల్ని అభ్యషిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడి విద్యార్థులకు భద్రత కొరవడినట్టుగా కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నా, అందుకు తగ్గ చర్యల్ని పాలకులు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన వైద్య పీజీ విద్యను అభ్యషిస్తున్న శరవణన్‌ అనుమానాస్పద మరణం తమిళనాట కలకలాన్ని రేపింది. ఆ కేసు విచారణ నేటికీ సాగుతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని వాదించే వాళ్లు ఎక్కువే. వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఇన్సులిన్‌ ద్వారా హత్య చేసి ఉండడానికి కారణాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఇక, గత నెల ఢిల్లీ ఎయిమ్స్‌ అనుబంధ కళాశాల్లో తిరుప్పూర్‌ జిల్లా పారప్పాళయం మంగళం సమీపంలోని ఇడువం పాళయం ప్రాంతానికి చెందిన సెల్వమణి , ధనలక్ష్మి దంపతుల కుమారుడు శరత్‌ ప్రభు(25) మృతిచెందడం ఆందోళనలో పడేసింది. ఈ  కేసు అనుమానాస్పదంగా మారడంతో మిస్టరీని తేల్చాలని ఆ కుటుంబం పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో మరో తమిళ విద్యార్థి బలికావడం తల్లిదండ్రుల్ని ఆందోళనలో పడేస్తున్నది. ఈ మరణం కూడా మిస్టరీగా మారడం ఉత్కంఠను రేపుతోంది.

మరో మిస్టరీ : రామనాథపురం జిల్లా రామేశ్వరం ఈశ్వరి అమ్మన్‌ ఆలయం వీధికి చెందిన గురుకుల్‌ రామస్వామి, భువనేశ్వరి దంపతుల కుమారుడు కృష్ణ ప్రసాద్‌(24). స్థానికంగా వివేకానంద విద్యాలయంలో పదో తరగతిలోఉత్తీర్ణుడయ్యాడు. నామక్కల్‌లో ప్లస్‌టూ పూర్తి చేశాడు. మంచి మార్కులు రావడంతో మేల్‌ మరువత్తురు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీటు దక్కింది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసినానంతరం ఉన్నత చదువు నిమిత్తం జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో మంచి మార్కుల్ని సాధించాడు. చండీఘర్‌లోని కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాల పీజీఐలో సీటు దక్కించుకున్నారు. జనరల్‌ మెడిసన్‌ (ఎండీ –రేడియాలజీ) తొలి సంవత్సరం చదువుతున్న కృష్ణప్రసాద్‌ మరణించినట్టుగా సోమవారం అందిన సమాచారం రామేశ్వరంలోని అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నతనం నుంచి డాక్టర్‌ కావాలన్న ఆశతో ఉన్న తనయుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం ఆ తండ్రిని కలవరంలో పడేసింది. తమ వాడు ఎలా మరణించాడో అన్న సమాచారాన్ని కూడా సరిగ్గా ఎవ్వరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు హిందీలో మాట్లాడాల్సిందేనన్న ఒత్తిడి ఇక్కడ ఉన్నదని, చాలా సతమతం అవుతున్నట్టు తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు కృష్ణప్రసాద్‌ చిన్నాన్న కుమార్‌ మీడియా దృష్టికి తెచ్చారు. రామనాథపురం జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగడంతో కృష్ణప్రసాద్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి.

కృష్ణప్రసాద్‌ స్నేహితులు అరవింద్, గౌతం, వరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, తమ మిత్రుడు డాక్టర్‌ కావాలన్న ఆశతో ఉన్నాడని, చిన్న నాటి నుంచి అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్నాడని వివరించారు. అయితే, హఠాత్తుగా అతడు మరణించినట్టుగా సమాచారం రావడం ఆందోళన కల్గిస్తున్నదని పేర్కొన్నారు. హాస్టల్‌ గదిలో ఉరేసుకుని మరణించినట్టు చెబుతున్నారని, అలాంటి చర్యలకు తమ మిత్రుడు పాల్పడి ఉండే అవకాశం లేదన్నారు.  ప్రభుత్వం చర్యలు తీసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మృతదేహం చండీఘర్‌ నుంచి మదురైకు విమానంలో తీసుకురానున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో అర్ధరాత్రి సమయానికి స్వస్థలం రామేశ్వరానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విద్యార్థి కుటుంబానికి సీఎం పళని స్వామి రూ. 3లక్షలు సాయం ప్రకటించారు. తమిళ విద్యార్థులు వరుసగా మరణిస్తుండడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ విషయంగా డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పేర్కొంటూ, వరసఘటనలన్నీ మిస్టరీలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, తమిళ విద్యార్థులకు భద్రతకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమిళ విద్యార్థుల కోసం కమిటీ :  ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న తమిళ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించినట్టు ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ తెలిపారు. పుదుకోట్టైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలోని విద్యా సంస్థల్లో చదువుకుంటున్న తమిళ విద్యార్థుల వివరాల సేకరణ, వారికి భద్రత కల్పించేందుకు తగ్గ చర్యల మీద ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం, మానసిక  పరంగా కౌన్సిలింగ్‌లు ఇవ్వడం తదితర అంశాల మీద దృష్టి పెట్టి ప్రత్యేక కమిటీని నియమించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement