సాక్షి, శ్రీకాకుళం : వధూవరులకు పెళ్లి చేసి వారితో ఆనందంగా తిరుగు పయనమయ్యారు. అయితే బయలుదేరిన కాసేపటికే వీరు వెళ్తున్న టాటా ఏస్ కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. గురువారం మండలంలోని అలికాం–బత్తిలి రోడ్డులో రావిచెంద్రి–కోవిలాం గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సరుబుజ్జిలి ఎస్సై కే మహలక్ష్మి, బాధితులు, స్థానికుల కథనం మేరకు... విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంపరేవళ్ల గ్రామానికి చెందిన కేశిరెడ్డి చిన్నికి హిరమండలం మండలంలోని శుభలయ కాలనీకి చెందిన గేదెల జ్యోతితో బుధవారం రాత్రి వివాహమైంది.
గురువారం ఉదయం శుభలయ కాలనీ నుంచి కొత్త దంపతులతోపాటు కొయ్యూరు మండలంలోని కసివలస, మంపరేవళ్ల, పాలపాలెం గ్రామాల నుంచి వచ్చిన బంధువులు మూడు టాటా ఏసీ వ్యాన్లతో తిరుగు పయనమయ్యారు. వీరు కోవిలాం కాలనీ దాటిన తర్వాత, పొలంలో విత్తనాలు వేసేందుకు బయలుదేరిన మండలంలోని చిన్నకొల్లి్లవలస గ్రామానికి చెందిన వంశధార నిర్వాసిత రైతు బూడిద గణపతి తన చిన్నమోపెడ్ (ద్విచక్ర) వాహనంతో రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. ఎటువైపు వెళ్లాలో తెలియక తికమకపడుతూ పెళ్లి వాహనానికి అడ్డంగా వచ్చేశాడు. ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో పెళ్లి వ్యాన్ రైతును ఢీకొని రోడ్డు పక్కన సాగునీటి కాలువలోకి బోల్తా కొట్టింది.
అదే వ్యాన్‌లో కొత్త దంపతులతోపాటు మరో ఎనిమిది మంది బంధువులు ఉన్నారు. అయితే కాలువలో కొద్దిగా నీరు, బురద ఉండటంతో వారికి పెద్ద ప్రమాదమే తప్పింది. అనపరెడ్డి అప్పారావుతోపాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. రైతు బూడద గణపతి రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. ఈయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని సరుబుజ్జిలి ఎస్సై కే మహలక్ష్మి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment