నెల్లూరు, సాక్షి ప్రతినిధి/బెంగళూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని ఆదివారం సాయంత్రం బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి భారీగా రుణాలు పొందిన వ్యవహారంలో కొన్నేళ్లుగా వాకాటి ఆరోపణలు ఎదుర్కొ న్నారు. ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావడంతో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించి, సాయంత్రం అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటి వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రా, వీఎన్‌ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్ షామీర్‌పేటలో రూ.12 కోట్లు విలువచేసే భవనం ఉంది. దీనిని నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువను భారీగా పెంచేసి, రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు.
ఫైనాన్స్ కార్పొరేషన్ 2014లో రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించడంలో వాకాటి నారాయణరెడ్డి విఫలం కావడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ బకాయి రూ.205.02 కోట్లకు చేరింది. దీంతో ఫైనాన్స్ కార్పొరేషన్ వాకాటి ఆస్తుల జప్తుపై దృష్టి సారించింది. రుణం కోసం ఆయన సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని విచారణలో తేలింది. దీంతో గతేడాది మే 5న ఫైనాన్స్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. మే 12న నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి విచారణ ప్రక్రియ కొనసాగించి ఆదివారం అరెస్ట్ చేసింది.
ఐపీ పెట్టిన రెండు కంపెనీలు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రా, వీఎన్‌ఆర్ రైల్ కంపెనీలు గతేడాది ఐపీ పిటిషన్ దాఖలు చేశాయి. బ్యాంకుల్లో రుణాలు వడ్డీలతో కలిపి రూ.వందల కోట్లు దాటడంతో రెండు కంపెనీలు ఐపీ(దివాలా) దాఖలు చేశాయి. మరోవైపు నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి వాకాటి రూ.443 కోట్ల రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తుల అటాచ్‌మెంట్, జప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి అరెస్ట్‌తో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది.
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అరెస్ట్
Published Mon, Jan 22 2018 1:18 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment