ఆలయంలో.. అపచారం | temple employee sexual assult on sweeper | Sakshi
Sakshi News home page

ఆలయంలో.. అపచారం

Published Fri, Oct 27 2017 8:30 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

temple employee sexual assult on sweeper - Sakshi

నిర్భయ వంటి చట్టాలు వచ్చినా మహిళల భద్రతకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఎంతో ప్రసిద్ధి చెందిన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఓ మహిళతో ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

అనంతపురం, కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. అక్కడ పనిచేసే మహిళా స్వీపర్‌పై అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి ఆలయ ప్రాంగణంలోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు.  కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో పని చేసే స్వీపర్‌ రామలక్ష్మి (పేరు మార్చాము) రోజూ లాగానే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచిన అనంతరం అద్దె గదుల్లో చెత్త ఊడుస్తోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఆలయ అటెండర్‌ వెంకటరమణ ఎవరూ లేనిది గమనించి ఆ గదిలోకెళ్లి తలుపునకు గొళ్లెం పెట్టి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఆమె ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ చైర్మన్‌ నరేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది.  అక్కడి ఉద్యోగులకు కూడా విషయాన్ని చెప్పింది. కానీ వారి నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో జరిగిన ఘోరాన్ని తన భర్తకు చెప్పి ఆవేదన చెందింది.

అన్యాయానికి ఖరీదు కట్టిన టీడీపీ నేత
రామలక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని తన భర్తతో కలిసి స్థానికంగా ఓ టీడీపీ నేత వద్దకు వెళ్లి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా అంతకు ముందే సదరు నేతను కలవడంతో చేసేది లేక అన్యాయానికి వెల కట్టే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ ఇక లాభం లేదని నేరుగా పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీలక్ష్మి వెంటనే స్పందిస్తూ నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితుడు వెంకటరమణపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 376, 506, 342 కింద కేసు (క్రైం.నెం314/2017)  నమోదు చేశారు. సీఐ శ్రీధర్‌ ఈ కేసును విచారిస్తున్నారు.

అటెండర్‌ను సస్పెండ్‌ చేశాం
ఆలయంలో మద్యం సేవించి స్వీపర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలయ అటెండర్‌ వెంకటరమణను అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement