నుజ్జయిన జీపు
హుకుంపేట (అరకులోయ): రెప్పపాటులో ఘోరం జరిగింది. హుకుంపేట మండల కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో సర్వీసు జీపును ఆర్టీసీబస్సు ఢీకొట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వీరిలో హుకుంపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాంబాబు, ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. విశాఖలో జరిగే నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష కోసం హుకుంపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు జీపులో బయలుదేరారు. పాఠశాల నుంచి జీపు బయలుదేరి మెయిన్‌రోడ్డుకు రాగానే ఎదురుగా పాడేరు నుంచి అరకులోయ వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి బయలుదేరిన రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం సంభవించడంతో పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. జీపులో ముందు సీట్లో ఉన్న డ్రైవర్ రవి, ఉపాధ్యాయుడు రాంబాబు, హాస్టల్ వర్కర్ మల్లన్న, విద్యార్థి వెంకటరావులకు బలమైన గాయాలు తగలగా, విక్రమ్, అనిల్, రమేష్, సుమన్, సింహాద్రి, నాగరాజు, ఉదయ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యసేవలు కల్పించారు. తలకు, ఇతర చోట్ల గాయాలైన ఐదుగురిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యసేవలు కల్పించారు.
బాధితులకు ఎమ్మెల్యే పాల్గుణ పరామర్శ
ప్రమాద సమాచారం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుకుంపేట మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడు, డ్రైవర్, హస్టల్ వర్కర్లను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కల్పించాలని, తీవ్రంగా గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ప్రమాదానికి గురైన జీపును ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మండల మాజీ ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గండేరు చినసత్యం, రమేష్, కూడా రామలింగం, కిల్లో రామకృష్ణ ఉన్నారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయ్‌కుమార్ కూడా ప్రమాదంపై స్పందించారు. ఉపాధ్యాయుడు రా>ంబాబు, విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలకు చర్యలు తీసుకున్నారు. సంఘటనపై ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన బస్, జీపులను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment