అనీల్ బిసాయి(ఫైల్)
కవిటి: అందరితో సరదాగా ఆడుకోవాల్సిన ఆ విద్యార్థిని కిడ్నీ భూతం మింగేసింది. నిండా 15 ఏళ్లు నిండకుండానే కబళించింది. బాలుడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని మాణిక్యపురం గ్రామానికి చెందిన అనీల్ బిసాయి(15) కిడ్నీవ్యాధితో పోరాడి తనువు చాలించాడు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇతడు ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. నెల రోజుల క్రితం వరకు చక్కగానే ఉన్న అనీల్ బిసాయికి ఉన్నట్టుండి ఒంట్లో బాగులేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యానికి సోంపేట తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షలన్నీ చేసిన తర్వాత బాలుడికి మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు.
దీంతో కన్నీరుమున్నీరైన అనీల్ తల్లిదండ్రులు రత్నాకర్ బిసాయి, ఖిరోమణి బిసాయి తమ బిడ్డకు అందినంతలో వైద్యం చేయిస్తూ వచ్చారు. అనీల్‌కు సీరం క్రియేటినైన్ 8 పాయింట్లు దాటిపోవడంతో తీవ్రంగా నీరసించి ఆదివారం తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనీల్ సోదరుడు సునీల్ బిసాయి విజయవాడలో ఓ హోటల్‌లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment