
వాషింగ్టన్ : కుక్కను కాల్చబోయి మహిళకు తుపాకీ గురిపెట్టాడో ఓ పోలీసు అధికారి. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన టెక్సాస్‌లోని అర్లింగ్‌టన్ షాపింగ్ మాల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. తనవైపునకు పరుగెత్తుకుంటూ వస్తున్న కుక్కను చూసి భయంతో వణికిపోయిన పోలీసు అధికారి.. తన గన్ తీసి దానిపైకి గురి పెట్టాడు. అనంతరం పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఎవరో గట్టిగా అరిచిన శబ్ధం వినపడటంతో అక్కడికి వెళ్లి చూశాడు. అయితే కుక్కకు బదులుగా ఓ మహిళ గాయపడినట్లు గుర్తించాడు. దీంతో కంగుతిన్న అతడు.. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కాగా ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందింది. మరణించిన మహిళను 30ఏళ్ల మార్గరీటాగా పోలీసులు గుర్తించారు. ఇక ఘటనకు కారణమైన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.