చోరీకి యత్నించి పోలీసులకు చిక్కిన యువకుడు
చెన్నై, తిరువళ్లూరు: జనం సంచారం తక్కువగా వున్న సమయంలో షాపు తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించిన యువకుడికి దేహశుద్ధి చేసిన ప్రజలు పోలీసులకు అప్పగించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలోని పలు షాపుల్లో ఇటీవలే చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారుల్లో అభద్రతా భావం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు శ్రీపెరంబదూరు–తిరువళ్లూరు రోడ్డులోని పూజాసామగ్రి విక్రయించే షాపునకు వెళ్లిన ఇద్దరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చోరీకి యత్నించారు. ఈ సమయంలో అటువైపు వెళ్లిన కొందరు షాపులను తెరిచి వుండడంతో పాటు లోపల యువకులు వున్నట్టు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమికూడి లోపల వున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. మరో యువకుడు పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి పట్టుకున్న యువకుడిని అప్పగించారు. యువకుడి వద్ద పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు పులియంతోపు ప్రాంతానికి చెందిన మదన్‌కుమార్‌గా గుర్తించారు. పరారైన యువకుడు మనవాలనగర్ ఎస్టీ కాలనీకి చెందిన మురుగేషన్‌గా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అరెస్టయిన మదన్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పట్టుబడిన మదన్‌కుమార్ పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో, సార్ నేను ఇళ్లలో ఎప్పుడూ చోరీలకు పాల్పడలేదు. ఇళ్లలో చోరీలు చేస్తే వారిలో కొంత మంది నిరుపేదలు కూడా వుండొచ్చు, వారి శాపం నాకు వద్దు. వాళ్లు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును చోరీ చేయాలంటే మనస్సు ఒప్పుకోదు. బహుశా ఇప్పటి వరకు 70 చోరీలు చేసి వుంటా. అందులో ఒక్క ఇళ్లు కూడా లేదు. అన్నీ షాపుల దొంగతనాలే. షాపులు నిర్వహించే వారు ధనికులే వుంటారు. అందుకే చోరీలు చేయడానికి షాపులనే ఎంచుకున్నట్టు చెప్పడంతో పోలీసులే షాక్‌కు గురైయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment