ప్రతీకాత్మక చిత్రం
డెహ్రాడూన్/సహరాన్‌పూర్: నకిలీ మద్యం తాగిన కారణంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో శుక్రవారం 34 మంది మరణించారు. మరో 44 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ కూడా 10 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. అంతకుముందు మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్ జిల్లాలో గత మూడు రోజుల్లో 8 మంది మరణించారు. వీరి మృతికి కూడా నకిలీ మద్యమే కారణమని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రెండు ఘటనలపై శాఖా పరమైన విచారణకు ఆదేశించడంతోపాటు మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీ సమీపంలోని బలూపూర్ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాక 13వ రోజైన గురువారం సాయంత్రం పెద్ద కర్మను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన భోజనంలో భాగంగా దాదాపు 78 మంది కల్తీ సారా సేవించారని ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతి భద్రతలు) అశోక్ కుమార్ చెప్పారు. బలూపూర్, సమీప గ్రామాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లా సహరాన్‌పూర్‌కు చెందిన బంధువులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. నకిలీ మద్యం తాగి చనిపోయిన వారిలో 16 మంది బలూపూర్ లేదా సమీప గ్రామాలకు చెందినవారు కాగా, 18 మంది సహరాన్‌పూర్ జిల్లా వాసులు. మిగిలిన 44 మంది చికిత్స పొందుతున్నారు. సహరాన్‌పూర్‌కు చెందిన వారంతా తమ ఇళ్లకు చేరాక ఉత్తరప్రదేశ్‌లోనే మరణించినట్లు ఆ జిల్లా ఎస్‌ఎస్‌పీ దినేశ్ వెల్లడించారు. ఒక వ్యక్తి ఆ కల్తీ సారాను బలూపూర్ నుంచి తెచ్చి సహరాన్‌పూర్‌లో అమ్మినట్లుగా కూడా తెలుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment