
కౌటాల (సిర్పూర్): బోరు మోటార్ మరమ్మతు కోసం బావిలోకి దిగి ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి చెందారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు దిగి మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన బుధవారం కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారెం మహేష్(18) ఇంట్లోని చేదబావిలో బోరు వేయించారు. కొద్ది రోజుల నుంచి బోరు మోటార్ పనిచేయడం లేదు. బుధవారం మరమ్మతు కోసం మొదట మహేష్ బావిలోకి దిగాడు. కొద్ది సేపటికి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మహేష్ బావ చొక్కల శ్రీనివాస్ (35) దిగాడు. శ్రీనివాస్ కూడా ఊపిరాడక పడిపోయాడు. లోనికి దిగిన ఇద్దరు బయటకు రాకపోవడంతో మహేష్ మేన బావమర్ది గాదిరెడ్డి రాకేశ్ (23) కూడా దిగాడు. రాకేశ్ కూడా ఊపిరాడక పడిపోయాడు.
బయటపడ్డ పోశం: బావిలో ఊపిరాడక పడిపోయారని కుటుంబీకులు గ్రామస్తులకు తెలిపారు. దీంతో పంజల పోశం అనే వ్యక్తి తాళ్లు కట్టుకుని లోనికి దిగే ప్రయత్నం చేశాడు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం పోశంకు కూడా ఊపిరాడకపోవడంతో బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ డి.మోహన్, ఎస్సై ఆంజనేయులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకునేందుకు కోడికి తాడుకట్టి లోనికి దించారు. శ్వాస అందక కోడి కూడా మృతి చెందింది. దీంతో ఆ ముగ్గురు కూడా ఊపిరాడక మృతిచెంది ఉంటారని పోలీసులు నిర్ధారించుకున్నారు. జేసీబీ ద్వారా బావి చుట్టూ తవ్విన అనంతరం పోలీసులు సింగరేణి రెస్క్యూ టీంను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. బావి లోతు 30 అడుగుల వరకూ ఉంది.
ముగ్గురిదీ ఒకే కుటుంబం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడు మహేష్ కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గాదిరెడ్డి రాకేశ్ ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సకినాం గ్రామానికి చెందిన చొక్కల శ్రీనివాస్ వ్యవసాయం చేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య శైలజ, కుమారుడు నవదీప్, కూతురు ప్రవళిక ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment