సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన గురువారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాదుల్లానగర్‌కు చెందిన మహముదా బేగం అల్లుడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ గౌస్ మరో ఇద్దరితో కలిసి గురువారం అత్తారింటికి ఫంక్షన్‌కు వచ్చాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా మౌలాలి కమాన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ట్రాఫిక్ పోలీస్ ముజఫర్ వారిని ఫొటో తీశాడు. దీనిని గమనించిన సాదిక్ హుస్సేన్ అసభ్యకరంగా చేతితో సంకేతాలు చేస్తూ ముందుకు వెళ్లాడు.
కొద్ది సేపటికే వారితో పాటు అక్కడికి వచ్చిన మహముదా బేగం, ఆమె భర్త గఫార్, కుమారులు మహ్మద్ మాజిద్, సయ్యద్ సాదిక్ ట్రాఫిక్ పోలీసు ముజఫర్‌పై దాడి చేశారు. కెమెరా లాక్కున్నారు. మహముదాబేగం అతడిని చెప్పుతో కూడా కొట్టే ప్రయత్నం చేసింది. స్థానికల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. మహముదా బేగం అధికారపార్టీ నాయకురాలిగా చెలామణి అవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment