Traffic staff
-
ట్రిపుల్ రైడింగ్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి..!
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన గురువారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాదుల్లానగర్‌కు చెందిన మహముదా బేగం అల్లుడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ గౌస్ మరో ఇద్దరితో కలిసి గురువారం అత్తారింటికి ఫంక్షన్‌కు వచ్చాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా మౌలాలి కమాన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ట్రాఫిక్ పోలీస్ ముజఫర్ వారిని ఫొటో తీశాడు. దీనిని గమనించిన సాదిక్ హుస్సేన్ అసభ్యకరంగా చేతితో సంకేతాలు చేస్తూ ముందుకు వెళ్లాడు. కొద్ది సేపటికే వారితో పాటు అక్కడికి వచ్చిన మహముదా బేగం, ఆమె భర్త గఫార్, కుమారులు మహ్మద్ మాజిద్, సయ్యద్ సాదిక్ ట్రాఫిక్ పోలీసు ముజఫర్‌పై దాడి చేశారు. కెమెరా లాక్కున్నారు. మహముదాబేగం అతడిని చెప్పుతో కూడా కొట్టే ప్రయత్నం చేసింది. స్థానికల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. మహముదా బేగం అధికారపార్టీ నాయకురాలిగా చెలామణి అవుతున్నట్లు సమాచారం. -
టీడీపీ నేతల వీరంగం
కారు తీసే విషయంలో ట్రాఫిక్ సిబ్బందితో వివాదం డీఎస్పీ కార్యాలయంలో పంచాయితీ అధికారంలో ఉన్న మాకు గౌరవం ఇవ్వరా అంటూ దేశం నేతల కేకలు జాతీయ రహదారిపై బైఠాయింపు అనకాపల్లి టౌన్: తెలుగు దేశం పార్టీ నేతలు శనివారం వీరంగం సృష్టించారు. అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న కశింకోట జెడ్పీటీసీ మలసాల ధనమ్మ కుమారుడు మలసాల కుమార్‌రాజా కారును అక్కడి నుంచి తీయమని ట్రాఫిక్ సీఐ కె.శ్రీనివాసరావు కోర డం తీవ్రవివాదానికి దారితీసింది. పట్టణంలోని ప్రధా న కూడలికి సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఆగి ఉన్న తెలుగుదేశం పార్టీ నేత కారును వేరే చోట పార్క్ చేయాలని కోరడం ట్రాఫిక్ పోలీసులు చేసిన నేరమైంది. ట్రాఫిక్‌సీఐ శ్రీనివాసరావు, మల సాల కుమార్ రాజాకు మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జనం భారీగా పోగవడంతో శాంతి భద్రతల నేపథ్యంలో పట్టణ సీఐ విద్యాసాగర్ రంగంలోకిదిగి అక్కడి జనాన్ని చెల్లాచెదారు చేశారు. అయితే తమకు పోలీసులు విలువ ఇవ్వలేదని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. ముందుగా కుమార్‌రాజాను అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించగా అందిన సమాచారం మేరకు తెలుగుదేశంపార్టీ నాయకులు పలువురు అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ సమక్షంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, పట్టణ సీఐ విద్యాసాగర్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు చర్చించారు. ‘మీరిక్కడెలా పని చేస్తారో చూస్తాం’ అంటూ డీఎస్పీ సమక్షంలో కుమార్‌రాజా బంధువులు పోలీసులను హెచ్చరించారు. పట్టణ సీఐ విద్యాసాగర్ తమ విధిని నిర్వహించామని చెప్పగా, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు వివాదానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం వివాదం సద్దుమణిగిందని భావించిన తరుణంలో కుమార్‌రాజా అనుచరులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీస్ వర్సెస్ టీడీపీ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగిన వ్యహారం చివరకు పోలీస్ వర్సెస్ టీడీపీగా మారింది. అధికారంలో ఉన్న తమకు గౌరవం ఇవ్వరా అంటూ దేశం పార్టీ నేతలు డీఎస్పీ కార్యాలయంలో కేకలు వేశారు. జనాన్ని చెదరగొట్టేసమయంలో ఒక యువకుడ్ని సివిల్ పోలీసులు కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది. రాత్రి 9.30 గంటలకు ధర్నా ప్రాంతానికి వెళ్లిన డీఎస్పీ పురుషోత్తం టీడీపీ నాయకులతో మరోసారి చర్చించి, సమస్య సద్దుమణిగేలా చేశారు. దీంతో శాంతించిన వారు ధర్నా విరమించారు. -
సీఎం హామీ.. నెరవేరదేమీ!
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలన్నీ డమ్మీలుగా మారాయి. సీఎం వరమిచ్చినా అధికార యంత్రాంగం కరుణించలేదు. దీంతో సిబ్బంది పరిస్థితి మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో పోలీసుశాఖ ఎంతో కీలకమైందని భావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదటి నుంచి ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. పోలీసు శాఖను పటిష్టపర్చడంలో భాగంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించినా గతేడాది పోలీసు అమరవీరుల దినం సందర్భంగా సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లులు ఏడాది కావొస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలోని 60 వేల మంది సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందికి తప్పని పాట్లు..! నిత్యం పొగ, దుమ్ము ధూళి, శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ నెల జీతంతోపాటు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనే డిమాండ్ ఎండమావిలా మారుతోంది. దీంతో రెండు వేల మంది ట్రాఫిక్ పోలీసులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని 2012 నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. దీంతో వీటి విధివిధానాల కోసం ప్రభుత్వం వేసిన కమిటీ సైతం నివేదిక అందజేసింది. కానిస్టేబుల్‌కు జీతంతోపాటు రూ.2,500, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.3 వేలు, ఎఎస్సైలకు రూ.3,500, ఎస్సైలకు రూ.4 వేలు, సీఐలకు రూ.4,500 అదనపు అలవెన్స్‌లు అందజేయాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు. ఎండమావిగా మారిన వీక్లీఆఫ్ సీఎం హామీకి అనుగుణంగా మొదటగా నల్లగొండ జిల్లాలో వీక్లీఆఫ్‌ను ప్రారంభించి, కొన్నాళ్లకే నిలిపేశారు. సిబ్బంది తీవ్ర కొరత కారణంగా అది సాధ్యం కాదంటూ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఒక్కో పోలీసుస్టేషన్లో 21 మంది సిబ్బంది ఉన్నారని, వీరి సంఖ్యను రెండు రెట్లు పెంచితే తప్ప వీక్లీఆఫ్ సాధ్యం కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సిబ్బందిపై కాస్త పనిభారం తగ్గించేందుకు 3,620 డ్రైవర్ కానిస్టేబుళ్ల నియామకానికి జీవో జారీ చేసినా నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. అమలుకు నోచుకోని హామీలు ♦ కానిస్టేబుళ్ల భత్యం రూ.90 నుంచి 250 పెంపు ♦ ఎస్ఐలకు గెజిటెడ్ హోదా ♦ పోలీసు సిబ్బందికి వారంతపు సెలవు ♦ పోలీసు క్యాంటీన్లో 100% వ్యాట్ మినహాయింపు ♦ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక అలవెన్స్, ఆరోగ్యభద్రత ♦ పోలీసు సిబ్బంది సొంతిటి కల.. -
ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్‌లు
- కానిస్టేబుల్‌కు రూ. 2,500, హెడ్ కానిస్టేబుల్‌కు రూ. 3 వేలు - ఏఎస్సైకి రూ. 3,500, ఎస్సైకి రూ. 4,000, సీఐకి రూ. 4,500 - 2 వేల మందికి లబ్ధి.. రెండ్రోజుల్లో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వరాల జల్లు కురిపించనుంది. నిత్యం పొగ, దుమ్మూ ధూళి, శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీనెల జీతంతో పాటు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానిస్టేబుల్‌కు జీతంతో పాటు రూ.2,500, హెడ్ కానిస్టేబుల్‌కు రూ.3 వేలు, ఏఎస్సైలకు రూ.3,500, ఎస్సైలకు రూ.4 వేలు, సీఐలకు రూ.4,500 అదనపు అలవెన్స్‌లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువరించేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న 1,800 మందికి, ఇతర జిల్లాల్లో దాదాపు 2 వందల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. మూడేళ్ల నిరీక్షణ: నిత్యం కాలుష్యం మధ్య విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదన మూడేళ్ల కింద తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులకు జీతంతో పాటు పొల్యూషన్ అలవెన్స్ కింద అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సిందిగా 2012లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్ హయాంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అప్పట్లో దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. పరిశీలించాల్సిందిగా ఆర్థిక శాఖకు సూచించింది. అయితే కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బందికి మాత్రమే అదనపు అలవెన్స్‌లు చెల్లించడం వల్ల జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయంటూ అధికారులు కొర్రీలు పెట్టారు. ఈ నేపథ్యంలో అలవెన్స్‌లపై చర్చించడం కోసం ఒక కమిటీ వేశారు. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య, కాలుష్యం ఎక్కువ కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతంలో 30 శాతం అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా ఆ కమిటీ సూచించింది. మిగతా జిల్లాల్లో వాహనాల సంఖ్య, వాటి నుంచి వెలువడే కాలుష్య శాతాన్ని లెక్కగట్టి సిబ్బందికి అదనపు అలవెన్స్ చెల్లించాల్సిందిగా సూచిం చింది. అయితే మూడేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలవెన్స్‌లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిం చింది. పోలీసుశాఖకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్... ట్రాఫిక్ పోలీసుల విన్నపానికి సానుకూలంగా స్పందించారు. గతంలో కమిటీ ఇచ్చిన నివేదికతో సంబంధం లేకుండా అందరికీ అలవెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
ట్రాఫిక్ రాజాల బేజార్!
రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం అనారోగ్యానికి గురవుతున్న ట్రాఫిక్ సిబ్బంది ఎండవేడిమి తట్టుకోలేక పోతున్న వైనం సిబ్బంది ఇబ్బందులు పట్టని ఉన్నతాధికారులు తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో రోజుకు 16 గంటలు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ పోలీసులు వాహన కాలుష్యకోరల్లో చిక్కుకునిఅనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు వయస్సు పైబడిన పోలీసులు కాలుష్యం కారణంగా ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 86 మంది కానిస్టేబుళ్లు, 18 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 23 మంది ఏఎస్ఐలు, నలుగురు ఎస్ఐలు ఉన్నారు. వీరు నగరంలోని దాదాపు 33 ట్రాఫిక్ రద్దీ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 24 మంది టాస్క్ఫోర్సు సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకూ, తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10గంటల దాకా మరో షిఫ్ట్ ఉంటుంది. ట్రాఫిక్ విధులతో రోగాలు.. నగరంలో రోజుకు లక్షకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని అంచనా. రద్దీ సర్కిళ్లలో విధులు నిర్వహించే సిబ్బందికి పొగ కాలుష్యం, శబ్ద కాలుష్యం తప్పడం లేదు. మిగిలిన రోజుల్లో ఏమోకానీ వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు మాత్రం తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మూడు నెలలుగా తిరుపతిలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు పైబడి నమోదవుతోంది. దీంతో పగటివేళ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిలో కొందరు తీవ్ర నిస్సత్తువకు (డీ హైడ్రేషన్‌కు) గురవుతున్నారు. వయసు మీరిన వారు కళ్లుతిరిగి పడిపోతున్నారు. తిరుపతిలో తిరిగిఏ వాహనాలకు రవాణా శాఖాధికారులు పొల్యూషన్ టెస్టింగ్ ఏళ్లతరబడి చేయకపోవడం కాలుష్యం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. పట్టించుకోని అధికారులు ట్రాఫిక్ విధులు నిర్వహించే వారు కాలుష్యానికి గురి కాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు మాస్క్‌లు సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన డీఎస్పీ, సీఐలు పోలీసుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవిలో మజ్జిగ ప్యాకెట్లు, కళ్లకు చలువ అద్దాలు, మాస్క్‌లు దాతల సహాయంతో పంపిణీ చేశారు. మజ్జిగ ప్యాకెట్లను రెండు పూటలా పంపిణీ చేసేవారు. అయితే ఈ వేసవిలో తమ యోగ క్షేమాలు పట్టించుకునే అధికారులు కరువయ్యారని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎండవేడిమి పెరుగుతున్నా రద్దీ సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి నీడ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. 10 గంటలకు డ్యూటీకి వచ్చే వారు మధ్యాహ్నం రెండుగంటల వరకూ ఈ ఎండల్లో వాహనాల మధ్య నిలబడి విధులు నిర్వర్తించడం ఎలా సాధ్యం? ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ఆలోచించాల్సి ఉంది. ఇలా ఎండలో నిలబడలేక చెట్టుకిందకు వచ్చిన సిబ్బందికి, చె కింగ్‌కు వచ్చే ఉన్నతాధికారులు చార్జిమెమోలు ఇస్తున్నారని తెలుస్తోంది. ట్రాఫిక్ విధులు నిర్వహించే వారి ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.