సీఎం హామీ.. నెరవేరదేమీ!
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలన్నీ డమ్మీలుగా మారాయి. సీఎం వరమిచ్చినా అధికార యంత్రాంగం కరుణించలేదు. దీంతో సిబ్బంది పరిస్థితి మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో పోలీసుశాఖ ఎంతో కీలకమైందని భావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదటి నుంచి ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. పోలీసు శాఖను పటిష్టపర్చడంలో భాగంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించినా గతేడాది పోలీసు అమరవీరుల దినం సందర్భంగా సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లులు ఏడాది కావొస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలోని 60 వేల మంది సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి తప్పని పాట్లు..!
నిత్యం పొగ, దుమ్ము ధూళి, శబ్ద కాలుష్యంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ నెల జీతంతోపాటు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనే డిమాండ్ ఎండమావిలా మారుతోంది. దీంతో రెండు వేల మంది ట్రాఫిక్ పోలీసులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని 2012 నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. దీంతో వీటి విధివిధానాల కోసం ప్రభుత్వం వేసిన కమిటీ సైతం నివేదిక అందజేసింది. కానిస్టేబుల్‌కు జీతంతోపాటు రూ.2,500, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.3 వేలు, ఎఎస్సైలకు రూ.3,500, ఎస్సైలకు రూ.4 వేలు, సీఐలకు రూ.4,500 అదనపు అలవెన్స్‌లు అందజేయాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు.
ఎండమావిగా మారిన వీక్లీఆఫ్
సీఎం హామీకి అనుగుణంగా మొదటగా నల్లగొండ జిల్లాలో వీక్లీఆఫ్‌ను ప్రారంభించి, కొన్నాళ్లకే నిలిపేశారు. సిబ్బంది తీవ్ర కొరత కారణంగా అది సాధ్యం కాదంటూ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఒక్కో పోలీసుస్టేషన్‌లో 21 మంది సిబ్బంది ఉన్నారని, వీరి సంఖ్యను రెండు రెట్లు పెంచితే తప్ప వీక్లీఆఫ్ సాధ్యం కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సిబ్బందిపై కాస్త పనిభారం తగ్గించేందుకు 3,620 డ్రైవర్ కానిస్టేబుళ్ల నియామకానికి జీవో జారీ చేసినా నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.
అమలుకు నోచుకోని హామీలు
♦ కానిస్టేబుళ్ల భత్యం రూ.90 నుంచి 250 పెంపు
♦ ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా
♦ పోలీసు సిబ్బందికి వారంతపు సెలవు
♦ పోలీసు క్యాంటీన్‌లో 100% వ్యాట్ మినహాయింపు
♦ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక అలవెన్స్, ఆరోగ్యభద్రత
♦ పోలీసు సిబ్బంది సొంతిటి కల..