- రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం
- అనారోగ్యానికి గురవుతున్న ట్రాఫిక్ సిబ్బంది
- ఎండవేడిమి తట్టుకోలేక పోతున్న వైనం
- సిబ్బంది ఇబ్బందులు పట్టని ఉన్నతాధికారులు
తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో రోజుకు 16 గంటలు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ పోలీసులు వాహన కాలుష్యకోరల్లో చిక్కుకునిఅనారోగ్యాల బారిన పడుతున్నారు. కొందరు వయస్సు పైబడిన పోలీసులు కాలుష్యం కారణంగా ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు.
తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో 86 మంది కానిస్టేబుళ్లు, 18 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 23 మంది ఏఎస్‌ఐలు, నలుగురు ఎస్‌ఐలు ఉన్నారు. వీరు నగరంలోని దాదాపు 33 ట్రాఫిక్ రద్దీ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 24 మంది టాస్క్‌ఫోర్సు సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకూ, తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10గంటల దాకా మరో షిఫ్ట్ ఉంటుంది.
ట్రాఫిక్ విధులతో రోగాలు..
నగరంలో రోజుకు లక్షకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని అంచనా. రద్దీ సర్కిళ్లలో విధులు నిర్వహించే సిబ్బందికి పొగ కాలుష్యం, శబ్ద కాలుష్యం తప్పడం లేదు. మిగిలిన రోజుల్లో ఏమోకానీ వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు మాత్రం తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మూడు నెలలుగా తిరుపతిలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు పైబడి నమోదవుతోంది. దీంతో పగటివేళ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిలో కొందరు తీవ్ర నిస్సత్తువకు (డీ హైడ్రేషన్‌కు) గురవుతున్నారు. వయసు మీరిన వారు కళ్లుతిరిగి పడిపోతున్నారు. తిరుపతిలో తిరిగిఏ వాహనాలకు రవాణా శాఖాధికారులు పొల్యూషన్ టెస్టింగ్ ఏళ్లతరబడి చేయకపోవడం కాలుష్యం పెరగడానికి కారణంగా తెలుస్తోంది.
పట్టించుకోని అధికారులు
ట్రాఫిక్ విధులు నిర్వహించే వారు కాలుష్యానికి గురి కాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులు మాస్క్‌లు సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన డీఎస్పీ, సీఐలు పోలీసుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవిలో మజ్జిగ ప్యాకెట్లు, కళ్లకు చలువ అద్దాలు, మాస్క్‌లు దాతల సహాయంతో పంపిణీ చేశారు. మజ్జిగ ప్యాకెట్లను రెండు పూటలా పంపిణీ చేసేవారు.
అయితే ఈ వేసవిలో తమ యోగ క్షేమాలు పట్టించుకునే అధికారులు కరువయ్యారని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎండవేడిమి పెరుగుతున్నా రద్దీ సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి నీడ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. 10 గంటలకు డ్యూటీకి వచ్చే వారు మధ్యాహ్నం రెండుగంటల వరకూ ఈ ఎండల్లో వాహనాల మధ్య నిలబడి విధులు నిర్వర్తించడం ఎలా సాధ్యం? ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ఆలోచించాల్సి ఉంది. ఇలా ఎండలో నిలబడలేక చెట్టుకిందకు వచ్చిన సిబ్బందికి, చె కింగ్‌కు వచ్చే ఉన్నతాధికారులు చార్జిమెమోలు ఇస్తున్నారని తెలుస్తోంది. ట్రాఫిక్ విధులు నిర్వహించే వారి ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.