టీడీపీ నేతల వీరంగం
కారు తీసే విషయంలో ట్రాఫిక్ సిబ్బందితో వివాదం
డీఎస్పీ కార్యాలయంలో పంచాయితీ
అధికారంలో ఉన్న మాకు గౌరవం ఇవ్వరా అంటూ దేశం నేతల కేకలు
జాతీయ రహదారిపై బైఠాయింపు
అనకాపల్లి టౌన్: తెలుగు దేశం పార్టీ నేతలు శనివారం వీరంగం సృష్టించారు. అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న కశింకోట జెడ్పీటీసీ మలసాల ధనమ్మ కుమారుడు మలసాల కుమార్‌రాజా కారును అక్కడి నుంచి తీయమని ట్రాఫిక్ సీఐ కె.శ్రీనివాసరావు కోర డం తీవ్రవివాదానికి దారితీసింది. పట్టణంలోని ప్రధా న కూడలికి సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఆగి ఉన్న తెలుగుదేశం పార్టీ నేత కారును వేరే చోట పార్క్ చేయాలని కోరడం ట్రాఫిక్ పోలీసులు చేసిన నేరమైంది. ట్రాఫిక్‌సీఐ శ్రీనివాసరావు, మల సాల కుమార్ రాజాకు మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జనం భారీగా పోగవడంతో శాంతి భద్రతల నేపథ్యంలో పట్టణ సీఐ విద్యాసాగర్ రంగంలోకిదిగి అక్కడి జనాన్ని చెల్లాచెదారు చేశారు. అయితే తమకు పోలీసులు విలువ ఇవ్వలేదని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. ముందుగా కుమార్‌రాజాను అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించగా అందిన సమాచారం మేరకు తెలుగుదేశంపార్టీ నాయకులు పలువురు అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ సమక్షంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, పట్టణ సీఐ విద్యాసాగర్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు చర్చించారు. ‘మీరిక్కడెలా పని చేస్తారో చూస్తాం’ అంటూ డీఎస్పీ సమక్షంలో కుమార్‌రాజా బంధువులు పోలీసులను హెచ్చరించారు. పట్టణ సీఐ విద్యాసాగర్ తమ విధిని నిర్వహించామని చెప్పగా, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు వివాదానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం వివాదం సద్దుమణిగిందని భావించిన తరుణంలో కుమార్‌రాజా అనుచరులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.
పోలీస్ వర్సెస్ టీడీపీ
ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగిన వ్యహారం చివరకు పోలీస్ వర్సెస్ టీడీపీగా మారింది. అధికారంలో ఉన్న తమకు గౌరవం ఇవ్వరా అంటూ దేశం పార్టీ నేతలు డీఎస్పీ కార్యాలయంలో కేకలు వేశారు. జనాన్ని చెదరగొట్టేసమయంలో ఒక యువకుడ్ని సివిల్ పోలీసులు కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది. రాత్రి 9.30 గంటలకు ధర్నా ప్రాంతానికి వెళ్లిన డీఎస్పీ పురుషోత్తం టీడీపీ నాయకులతో మరోసారి చర్చించి, సమస్య సద్దుమణిగేలా చేశారు. దీంతో శాంతించిన వారు ధర్నా విరమించారు.