
సాక్షి, గడివేముల(కర్నూలు) : జిల్లాలో ఇటీవల వరుసగా బేతంచర్ల, గడివేముల, బనగానపల్లె ప్రాంతాల్లో బ్యాంకు వద్ద ఉన్న ప్రజలను మభ్యపెట్టి వారి బైక్‌లు, బ్యాగ్‌లలో ఉచిన నగదు, బంగారు దోచుకున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గడివేముల పోలీసులు అరెస్ట్ చేశారని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఓజి కుప్పం గ్రామానికి చెందిన కుంచల హరికృష్ణ, కుంచల శందిల్ అలియాస్ వెంకటేశ్వర్లు, హరికృష్ణ భార్య కుంచల దీప తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణానికి చెందిన వెంకటేష్ అనే నేరస్తుడితో కలిసి జిల్లాలో బేతంచర్ల, గడివేముల, బనగానపల్లె గ్రామాల్లో, అనంతపురం జిల్లా చిలమత్తురులో బ్యాంక్‌ల వద్ద మోటారు సైకిల్ డిక్కీల్లో డబ్బులు, బంగారం పెట్టుకెళ్లే వారిని గమనిస్తూ వారి దృష్టిని మళ్లించి చోరీ చేసేవారన్నారు.
హరికృష్ణపై నెల్లూరు జిల్లా నాయుడుపేటలో, తమిళనాడులోని తిరుచ్చి, అరక్కోణం, కర్ణాటకలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కుంచల శందిల్‌పై తిరుపతి,కాణిపాకం, విజయవాడ, రేణిగుంటలో దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరు చోరీ చేసిన సొమ్మును హరికృష్ణ భార్య దీపకు అందజేసేవారు. ఇలా బేతంచర్ల, గడివేముల దొంగతనాలకు సంబంధించి హరికృష్ణ, దీప నుంచి రూ.1.35లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం చేసిన బంగారం ఉంచుకున్న కుప్పం ప్రాంతానికి చెందిన ఒకరు, వెంకటేష్, మరో మహిళ పరారీలో ఉన్నారని త్వరలో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. వీరి అరెస్ట్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పాణ్యం సీఐ నాగరాజు యాదవ్, గడివేముల ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment