
అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చూపుతున్న డీఎస్పీ వెంకటరమణ
సిరిసిల్లక్రైం: ఇనుప కడ్డీకి బంగారం పూత పూసి సినీఫక్కీలో బంగారం దొంగిలించే కి‘లేడీ’తో పాటు మరో ఇద్దరు దొంగలు సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గత నెల 22న సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్ గ్రామానికి చెందిన జిర్ర గౌరవ్వ నకిలీ బంగారంతో మోసపోయింది. వెంటనే సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో దొంగతనానికి పాల్పడిన ఉప్పతాళ్ల దేవితో పాటు మరో దొంగ చిరంజీవి, బంగారం కొనుగోలు చేస్తున్న రావూఫ్‌ను సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో గురువారం పట్టుకున్నారు.
అమాయక మహిళలే టార్గెట్‌గా..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నుల్కపేటకు చెందిన ఉప్పతాళ్ల దేవి ఉరఫ్ పాపమ్మ ప్రధాన సూత్రధారిగా అదే జిల్లా ముప్పాళ్ల మండల మదాలకు చెందిన బండారి చిరంజీవి, బండారి గురువమ్మ, కోటమ్మ ముఠాగా ఏర్పడ్డారు. ఆమాయక మహిళలే లక్ష్యంగా వాళ్ల వద్ద ఉన్న బంగారు పూత అద్దిన కడ్డీలను ఇచ్చి అసలు బంగారాన్ని దొంగిలిస్తారు. ఇలా దొంగిలించిన బంగారాన్ని గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండే రా వూఫ్, కొమ్మూరు నాగేశ్వర్‌రావుకు విక్రయిస్తుంటారు.
పలు ప్రాంతాల్లో మోసాలు..
ఈ ముఠా ఇప్పటికి బైంసా, నిర్మల్, కోరుట్లలో పలు బంగారు దొంతనాలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డుల్లో ఉంది. సిరిసిల్లలో దొంగిలించిన బంగారాన్ని బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్ పైభాగంలో కవర్‌లో పెట్టి భద్రపరిచారు. దానిని తీసుకెళ్లడానికి రావూఫ్ వచ్చాడు. ఉప్పతాళ్ల దేవి, చిరంజీవి బంగారాన్ని అతడికి ఇస్తున్న క్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్, సిబ్బంది ముగ్గురి పట్టుకుని అరెస్టు చేశారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బన్సీలాల్‌ను, సిబ్బందిని డీఎస్పీ వెంకరమణ అభినందించారు.
అత్యాశకు పోవొద్దు..
ప్రజలు అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకోవద్దని డీఎస్పీ వెంకటరమణ కోరారు. అనుమానితుల కనబడితే నేరుగా సమాచారం ఇవ్వాలని వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. దొరికిన ఇద్దరు దొంగలను రిమాండ్‌కు పంపుతామని, పరారీలో ఉన్నావారికోసం గాలింపు చర్యల చేపడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment