టిఫిన్ బాక్స్‌లో బాంబు , వెతుకుతున్న స్వాడ్
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సరగుడి డీఎన్‌కె గ్రామం రహదారిలో రెండు టిఫిన్ బాక్సులలో బాంబులు కనిపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. టిఫిన్ బాక్స్ బాంబులై ఉండవచ్చని ఆ ప్రాంత ప్రజలు అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఒక బాలుడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో కోళ్ల ఫారం సమీపంలో రెండు టిఫిన్ బాక్సులు కనిపించగా ఆ విషయం గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వాటిని టిఫిన్‌బాక్స్ బాంబులని అనుమానించి పోలీసులకు తెలియజేశారు. సమాచారం మేరకు వెంటనే రాయిఘర్ పోలీసులు వచ్చి పరిశీలించి బాంబు డిస్పోజల్ టీమ్‌ను రప్పించారు. వారు వచ్చి ఒక బాంబును నిర్వీర్యం చేశారు. రెండో దానిని పేలకుండా చేసేందుకు ప్రయత్నిçస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఇంకా ఆ బాంబును నిర్వీర్యం చేయనట్లు సమాచారం. అయితే ఆ టిఫిన్ బాక్స్ బాంబులు ఆదివారం సాయంత్రం నుంచి ఆ ప్రాంతంలో పడి ఉన్నాయని సోమవారం వాటిని చూసిన తరువాత గ్రామస్తులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఆ టిఫిన్ బాక్స్‌లో బాంబులు ఎవరు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేసి పెట్టారన్నది తెలియడం లేదు. రాయిఘర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పాటు వారి కార్యకలాపాలు జోరుగా సాగుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది.
గత కార్యకలాపాలతో తీవ్ర భయాందోళన
గతంలో రాయిఘర్ సమితిలోని అనేక ప్రాంతాలలో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. అంతే కాకుండా పలువురు వక్తులను ఇన్‌ఫార్మర్ల పేరిట హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఉమ్మరకోట్ ఎంఎల్‌ఏ జగబంధు మఝిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. అయితే రాయిఘర్ ప్రాంతంలో కొంత కాలంగా మావోయిస్టుల సంఘటనలు అంతగా జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా రెండు టిఫిన్ బాక్స్ బాంబులు కనిపించడంతో ప్రజలు, పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మావోయిస్టులు ఎవరిని టార్గెట్ చేశారోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సహజంగా మావోయిస్టులే టిఫిన్ బాక్స్‌లలో బాంబులు పెట్టి జవాన్లను గానీ మరెవరినైనా టార్గెట్ చేస్తారని అందరి అనుమానం. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేలవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మరేమైనా టిఫిన్ బాక్సు బాంబులు ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అణువణువు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment