పంట దూరమై.. బతుకు భారమై | Titli Cyclone To Women Suicide In Srikakulam | Sakshi
Sakshi News home page

పంట దూరమై.. బతుకు భారమై

Published Sat, Oct 20 2018 2:25 PM | Last Updated on Sat, Oct 20 2018 2:25 PM

Titli Cyclone To Women Suicide In Srikakulam - Sakshi

నారాయణమ్మ మృతదేహం

ఒక ప్రాణం బలైపోయింది. తిత్లీ మిగిల్చిన విషాదాన్ని పెంచుతూ ఓ అభాగ్యురాలు ఊపిరి ఆపుకుంది. తుఫాన్‌ ధాటికి ధ్వంసమైపోయిన జీడి పంటను చూసి బతుకుపై ఆశలు వదులుకుంది. నాశనమైపోయిన ఆ తోటను చూసి ఆ గుండె తట్టుకోలేకపోయింది. రాకాసి గాలుల ధాటికి నిలువెల్లా చీలిపోయిన చెట్లను చూసి, దిగుబడి ఇక ఉండదనే నిజం తెలిసి సైని నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. 

వజ్రపుకొత్తూరు రూరల్‌: తిత్లీ మిగిల్చిన విషాదం ప్రాణాలు తోడేస్తోంది. నాశనమైన తోటలు చూడలేక ఉద్దానం బిడ్డలు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో జీడి రైతు సైని నారాయణమ్మ(49) జీడి పంటను పోగొట్టుకుని తట్టుకోలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. కళ్ల ముందే తిత్లీ తుఫాన్‌ ప్రభావంతో పంట నాశనం కావడంతో దీన్ని జీర్జించుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. తరతరాలుగా తమ సాగులో ఉన్న 2.50 ఎకరాల జీడి పంట తుఫాన్‌ సృష్టించిన బీభత్సానికి పూర్తిగా పడిపోయింది. పంట సాగు చేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక, కళ్ల ముందే మోడు బారిన చెట్లను చూడలేక బతుకు భయంతో ఆమె చనిపోయినట్లు వారు తెలిపారు.

పంటను చూడలేక..
ప్రస్తుతం గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండటంతో మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్‌ కుమార్‌ స్వగ్రామానికి రెండు రోజుల కిందటే వచ్చారు. శుక్రవారం ఉదయం తల్లితో కలిసి తోటను చూడడానికి వెళ్లారు. అయితే కనుచూపు మేరకు ఎండిన మోడులు కనిపించడంతో ఆమె భరించలేక ఇంటికి వెళ్లిపోయారు. కుమారుడు తోట చూసి కొద్ది సేపటికి ఇంటికి చేరారు. అప్పటికే ఆమె ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దించారు.

బతుకంతా కష్టమే..
నారాయణమ్మ కుటుంబానికి జీడితోటే ఆధారం. ఆమె భర్త ఆనందరావు ఏడేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఇక్కడ అంతగా ఆదాయం లేక నారాయణమ్మ ఇద్దరు కుమారులు విజయవాడలో ప్రైవేట్‌ కంపెనీలో పనులు చేసుకుంటున్నా రు. దీంతో మృతురాలు చినవంకలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు తుఫాన్‌ ధాటికి పంట పోవడంతో అప్పులు తీర్చలేనేమోనని ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

పండగ పూట విషాదం
దసరా పండగ నాడు ఆనందంగా గడపాల్చిన చినవంకలో ఆమె మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. తుఫాన్‌ తాకిడితో సర్వం కోల్పోయిన వారు తమకు తోచిన మేరకు పంటను జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా ఈ వార్త తెలియడంతో అంతా విషాదంలోకి వెళ్లిపోయారు. మృతిరాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్‌ సీఐ తాతారావు, స్థానిక ఎస్సై కె.వి సురేష్‌లు సంఘటన స్థలానికి చేరుకోని మృతి జరిగిన తీరును పరిశీలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.

బతుకుతెరువు లేదని బాధపడింది
రెండురోజుల క్రితం ఊరు వచ్చాను. అమ్మ నాతో ఆడిన చివరి మాటలు అయ్యా మన జీడి తోట పూర్తిగా పోయింది. మన కు ఇక బతుకుతెరువు లేదు అని బాధపడింది. శుక్రవారం ఇద్దరం కలిసి తోటకి వెళ్లాం. అమ్మ ముందుగానే తిరి గి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది సేపు అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంతలో అమ్మ చనిపోయి కనిపించింది. గతంలో తం డ్రి.. ఇప్పు తల్లి కూడా మాకు దూరమైంది. సైని దీలిఫ్‌కుమార్, మృతురాలి కుమారుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement