రోధిస్తున్న భార్య రాధామాధురి, ఇన్‌సెట్‌లో మాధవరెడ్డి (ఫైల్)
సాక్షి, కె బిట్రగుంట (సింగరాయకొండ): అతి కిరాతకంగా ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆదివారం జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట గ్రామ పరిధిలోని బీసీ కాలనీ సమీపంలో జరిగింది. మృతదేహాన్ని రోడ్డు పక్కన మార్జిన్లో పడవేశారు. పోలీసుల కథనం ప్రకారం మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామానికి చెందిన దేవరపల్లి మాధవరెడ్డి (35) కె బిట్రగుంట ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని మరణం పట్ల పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం తలపై రాయితో గాయపరిచారిచినట్లు కనిపిస్తుంది. ఇంకా ముఖంపై కూడా గాయాలున్నాయని, గొంతును తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే బహిర్బూమికి వచ్చిన కాలనీవాసులు అక్కడ మృతదేహం ఉండటం చూసి గ్రామస్తులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ హత్య జరగలేదని స్థానికులు తెలిపారు. హత్య జరిగిన సమాచారం అందిన వెంటనే ఒంగోలు ఇన్‌చార్జి డీఎస్పీ బాల సుందరం, ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ కమలాకర్, టంగుటూరు, సింగరాయకొండ ఎస్సైలు వై.వి. రమణయ్య, పులిరాజేష్‌లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
తరువాత డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలం మృతదేహం పరిసరాలను వాసన చూసి అక్కడ నుంచి సింగరాయకొండ వైపు ఫ్‌లైఓవర్ చివరి వరకు వెళ్లి ఆగిపోయింది. దీనిని బట్టి హంతకులు ఏదైనా వాహనంలో వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య పూర్తిగా పథకం ప్రకారం జరిగిందేనన్న అనుమానాలు పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు మృతుడికి పరిచయం ఉన్న కొంతమందిని సింగరాయకొండ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ కేసును ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు విచారిస్తున్నారని ఎస్సై కమలాకర్ పేర్కొన్నారు. ఈ హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఆర్థిక లావాదేవీలా లేక వివాహేతర సంబంధమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుమన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.
మృతుడి ముఖంపై గాయాలు ఉన్న దృశ్యం
హత్యపై పలు అనుమానాలు:
దేవరపల్లి మాధవరెడ్డి హత్యకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామానికి చెందిన దేవరపల్లి కొండారెడ్డికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మాధవరెడ్డి చివరి సంతానం. అయితే అన్నదమ్ములు ముగ్గురు కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలులో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొండారెడ్డికి సుమారు 30 ఎకరాల ఆస్తి ఉంది. గతంలో అతడి బంధువులు సుమారు 8 ఎకరాలకు కొండారెడ్డితో వేలు ముద్ర వేయించుకుని తరువాత ఆ పొలం మాదేనని కోర్డులో దావా వేసి గెలుపొందారు. వీరు కోర్టులో గెలుపొందినప్పటికీ పొలం మాత్రం కొండారెడ్డి కొడుకుల ఆధీనంలోనే ఉంది. అంతేకాక మాధవరెడ్డి ఈ ఎనిమిది ఎకరాల పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి ఆ డబ్బుతో ట్రాక్టరు కొనుగోలు చేశాడు.
ట్రాక్టరుకు నెలసరి వాయిదాలు సరిగా కట్టకపోవటంతో ఫైనాన్స్ కంపెనీ వారు ట్రాక్టర్‌ను తీసుకుని వెళ్లారు. ఆ తరువాత మాధవరెడ్డి ట్రాక్టరుకు డ్రైవర్‌గా వెళుతున్నాడు. మాధవరెడ్డి తన అక్క రమణమ్మ కూతురు రాధామాధవిని సుమారు 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే మద్యానికి, వివాహేతర సంబంధాలకు అలవాటుపడ్డ మాధవరెడ్డి తన భార్యను సరిగా పట్టించుకోకపోవటంతో ఆమె కొద్ది సంవత్సరాలుగా తన ఇద్దరు కూతుళ్లతో కొండపి మండలం కె ఉప్పలపాడు గ్రామంలోని అమ్మగారింట్లో ఉంటోంది. ఈ హత్యకు పొలం గొడవలా లేక వివాహేతర సంబంధమా లేక ఆర్థిక లావాదేవీలా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment