
సూర్యాపేట క్రైం: కొడుకుల కోసం సర్వస్వం ధారపోసిన ఓ తండ్రికి ఇప్పుడు పట్టెడన్నం కరువైంది. చివరకు అతను దేహీ అంటూ యాచకుడిగా మారాడు. సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన కంబాలపల్లి లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు తన వద్ద ఉన్న యావదాస్తిని వారికి రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే.. ఆ ఆస్తి మొత్తాన్ని కుమారులు విక్రయించి వారి పేరిట ఓ ఇల్లును కొనుగోలు చేసుకున్నారు. కొంత కాలంగా లింగయ్య అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.
నెలకు ఒకరు చొప్పున చూసుకుంటున్న కుమారులు.. ఇకపై సాకడం తమ వల్ల కాదని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో లింగయ్య చేసేదేమి లేక అదే వార్డులో నివాసం ఉంటున్న పెద్ద కుమార్తె వద్ద మూడు నెలలుగా ఉంటున్నాడు. అయితే తన భర్తకు పక్షవాతం రావడంతో అటు భర్తను.. ఇటు కనిపెంచిన తండ్రిని సాకడం ఆమెకు కష్టతరంగా మారింది. ఎలాగైనా సోదరులకు నచ్చజెప్పి తండ్రిని వారి ఇళ్లకు పంపించాలని శుక్రవారం వచ్చింది. కానీ.. వారు తగువులాటకు దిగి చేతులెత్తేశారు.
యాచకుడిగా మారిన వృద్ధ తండ్రి
కుమార్తె కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో లింగయ్య అదే ప్రాంతంలో అడుక్కొని పొట్ట పోసుకుంటున్నాడు. కాగా, తనకు న్యాయం చేయాలని లింగయ్య శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుమారులు తనను చూడటం లేదని విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment