
సాక్షి, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ : ఐఏఎస్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారి సఫీర్ కరీంపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఆయన నుంచి వివరణ కోరుతామని, వివరణ సంతృప్తికరంగా లేకుంటే మాత్రం శిక్ష తప్పదని పేర్కొన్నారు. 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సఫిర్ కరీం ప్రస్తుతం తిరునల్వేలి జిల్లా నంగునేరిలో పనిచేస్తున్నారు. ఐఏఎస్ కావాలన్న కోరికతో మరోసారి యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలోని ఎగ్మోర్‌లోని పరీక్షా కేంద్రంలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ దొరికిపోయారు. ఆయనకు సహకరించిన భార్య అతని భార్య జాయిస్ జాయ్‌తోపాటు కోచింగ్ సెంటర్ లాఎక్స్‌లెన్స్ నిర్వాహకుడు రాంబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడెమీపై పోలీసులు దాడి చేసి, పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టడీ సర్కిల్ మాస్ కాపీయింగ్‌కు అడ్డాగా మారినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని తమిళనాడు డీసీపీ అరవిందన్ తెలిపారు. జాయిస్ జాయ్‌తోపాటు రాంబాబును నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై తమిళనాడుకు తరలించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment