నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’ | Triple Riders Beaten And Robbed Men in Hyderabad | Sakshi
Sakshi News home page

‘లాక్కుపోయి’ దోపిడీ దొంగలయ్యారు!

Published Sat, Jul 20 2019 10:05 AM | Last Updated on Mon, Jul 22 2019 12:13 PM

Triple Riders Beaten And Robbed Men in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అది వేళగాని వేళ... ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రయాణిస్తున్నారు... దీనిని చూసిన మరో వాహనచోదకుడు ‘ఇంకొకరిని ఎక్కించుకోపోయారా?’ అన్నాడు...దీంతో ఆగ్రహించిన ఆ నలుగురూ వీరి వాహనాన్ని వెంటాడి అటకాయించారు... విచక్షణారహితంగా దాడి చేశారు... అంతటితో ఆగకుండా బాధితుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ లాక్కుపోయారు... సీన్‌ కట్‌ చేస్తే ఈ నలుగురిపై దోపిడీ కేసు నమోదు కావడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఓ మైనర్‌ కూడా ఉన్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన డిగ్రీ విద్యార్థులు ఉదయ్‌కిరణ్, బి.రిషికేష్‌ యాదవ్, మల్లేపల్లికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి సి.రాహుల్, మరో ఇంటర్మీడియట్‌ విద్యార్థి స్నేహితులు. వీరిలో ఒకరి పుట్టి రోజు వేడుకలు చేసుకునేందుకు గత శనివారం రాత్రి నెక్లెస్‌రోడ్‌కు వెళ్లారు. అర్థరాత్రి ‘ఫంక్షన్‌’ పూర్తి చేసుకుని మద్యం మత్తులో తిరిగి వస్తున్నారు.

అదే సమయంలో మూసాపేట్‌కు చెందిన నలుగురు స్నేహితులు రెండు బైక్‌లపై బిర్యానీ కోసం బషీర్‌బాగ్‌ వైపు బయలుదేరారు. వీరికి ఆ నలుగురూ ఎర్రమంజిల్‌ ప్రాంతంలో తారసపడ్డారు. ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణించడాన్ని గమనించిన వీరిలోని ఓ వ్యక్తి ‘దానిపై నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు ‘రా నువ్వే ఎక్కు’ అంటూ అనడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఓ వాహనంపై ఉన్న నలుగురూ... రెండు బైక్‌లపై ఉన్న నలుగురి వెంటపడ్డారు. ఖైరతాబాద్‌ రైల్వే గేట్‌ సమీపంలో వారిని అడ్డుకుని తమను కామెంట్‌ చేసిన వ్యక్తితో పాటు మరొకరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బాధితుడి మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అదే సమయంలో పోలీసు గస్తీ వాహనం అటుగా రావడంతో వారు అక్కడినుంచి పరారయ్యారు. బాధితుడు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాడి చేసిన నలుగురూ సొత్తు కూడా లాక్కోవడంతో ఇది దోపిడీ దొంగతనం కేసుగా మారింది. నేరం జరిగిన తీరును బట్టి ఇది ప్రొఫెషనల్స్‌ పనిగా భావించిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులుతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుల వాహనం ఆచూకీ తెలిసింది . దీంతో ఆ ఫుటేజ్‌ను మరింత విశ్లేషించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రాహుల్‌ ఫొటో సంగ్రహించగలిగారు. దీని ప్రింట్స్‌ తీసుకున్న బృందాలు ఆ ఫొటోలతో ఖైరతాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. ఫలితంగా స్థానికులు అతడిని గుర్తుపట్టి ఆచూకీ చెప్పారు. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... మిగిలిన ముగ్గురి వివరాలు తెలిశాయి. దీంతో మైనర్‌ సహా నిందితులను పట్టుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురూ దాడి చేయడంతో ఆగితే సాధారణ కేసుగానే ఉండేదని, అయితే సొత్తు లాక్కుపోవడంతో దోపిడీగా మారి దాని ప్రాధాన్యత పెరిగిందని పోలీసులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement