
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలంటుకోవడంతో కోట్లాది రూపాయల కరెన్సీ కళ్లముందే కాలి బూడిదైంది. అనంతనాగ్ జిల్లా ఖాజిగంద్ ప్రాంతంలోని పంజాత్‌లో ఆదివారం-సోమవారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లోకల్ టీవీ చానెళ్లలో ప్రసారం చేసిన వీడియోలో.. ట్రక్కులో, రోడ్డు మీద పెద్ద ఎత్తున పడి ఉన్న తగలబడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్ నుంచి ట్రక్కు జమ్ముకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రక్కులో రూ. ఐదువందల కరెన్సీనోట్ల కట్టలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ఎన్నికల సంఘం, పోలీసులు ఘటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందా? అదే అయితే, ఏ పార్టీ, ఏ అభ్యర్థి తరఫున ఈ డబ్బు రహస్యంగా తరలించారని అన్నది తెలియాల్సి ఉంది.