నాగరాజు, హరి
వెల్దుర్తి: సిద్ధినగట్టు సమీపంలోని ఓ సుద్ద క్వారీలో గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. బోయనపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శ్రీను కుమారుడు వడ్డె నాగరాజు(17) జేసీబీ ఆపరేటర్‌గా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన దుబ్బరాజు కుమారుడు వడ్డే హరి(16) ఇటీవల వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో వడ్డే నాగరాజు వెంట జేసీబీ హెల్పర్‌గా వెళ్లాడు. సిద్ధినగట్టు సమీపంలోని వెల్దుర్తికి చెందిన పారిశ్రామిక వేత్త క్వారీలో సాయంత్రం పూట ఇద్దరూ సుద్ద తవ్వుతుండగా వీరు ఉన్న ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనలో వారు జేసీబీతో సహా దాదాపు 20 అడుగుల లోతులో పడ్డారు.
ఆ తర్వాత పైనుంచి సుద్దపడడంతో అందులో కూరుకుపోయారు. జేసీబీ కోసం వచ్చిన కొందరు వారిని గుర్తించారు. వెంటనే సుద్దను తొలగించి జేసీబీ అద్దాలు బద్దలుకొట్టి వారిని వెలికి తీసి ట్రాలీ ఆటోలో బ్రహ్మగుండం ప్రాంతానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన వెంటనే హరి మరణించాడు. చేతికొచ్చిన కుమారులు హఠాన్మరణం చెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ–2 నగేష్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ఒకేసారి మృతి చెందడంతో బోయినపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా సంఘటనకు అరగంట ముందు భారీ వడగండ్ల వర్షం కురిసింది. ఈకారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment