quarry workers
-
క్వారీలో బ్లాస్టింగ్..ఇద్దరి మృతి
కీసర: క్రషర్ మిషన్ క్వారీ వద్ద జరిగిన బ్లాస్టింగ్‌లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని గుట్టకమాన్ వద్ద గల ఎస్‌ఎల్‌ఎంఐ క్రషర్ మిషన్ సమీపంలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన అన్నారం బాల్‌రాజ్ (36), గువ్వల బాల్‌రాజ్(32)లు ఇరువురు క్రషర్‌మిషన్‌లో సూపర్వైజర్లుగా పనిచేస్తుంటారు. ఈమేరకు వీరు శుక్రవారం సాయంత్రం క్వారీ వద్ద బ్లాస్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బ్లాస్టింగ్ చేసే ముందు క్వారీ వద్ద పరిసరాలను పరిశీలించేందుకు ఇద్దరు క్వారీ సమీపంలోకి వెళ్లారని, ఇంతలోనే ఒక్కసారిగా బ్లాస్టింగ్ కావడంతో ఇద్దరు అక్కడికక్కడే బండరాళ్ల మధ్యలో ఇరుక్కొని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా బ్లాస్టింగ్ జరగడానికి గల కారణాలు పూర్తిగా తెలియరావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా వీరు క్వారీ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి మెరుపులు రావడంతో బ్లాస్టింగ్ కోసం ఏర్పాటు చేసి విద్యుత్ వైర్లకు విద్యుత్‌సరఫరా అయి బ్లాస్టింగ్ జరిగిందని తోటి కార్మికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల్లో అన్నారం బాలరాజ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నట్లు, గువ్వల బాల్‌రాజ్ భార్య గర్బవతి అని పోలీసులు తెలిపారు. -
సూదికొండ క్వారీపై బెదిరింపులు
శ్రీకాకుళం, కంచిలి: మండలంలోని మండపల్లి పంచాయతీ బంజిరినారాయణపురం గ్రామానికి ఆనుకొని ఉన్న సూదికొండలో క్వారీ అనుమతులపై గ్రామస్తులు విభేదిస్తున్న నేపథ్యంలో సంబంధిత క్వారీ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన క్వారీని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. సూదికొండ వద్దకు సోంపేట సీఐ పి.తిరుమలరావు, కంచిలి ఎస్ఐ ఎం.హరికృష్ణ, నలుగురు కానిస్టేబుళ్లు, మండల సర్వేయర్ నాగేశ్వరరావు, టెక్కలి మైన్స్ అధికారి రవికుమార్, క్వారీ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ సతీష్‌రెడ్డిలు సోమవారం వెళ్లి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు. క్వారీ తవ్వకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, తవ్వకాలు చేపడితే జీవనోపాధిని కోల్పోతామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై తీరుమారకపోతే వేరేవిధంగా ఉంటుందని హెచ్చరించినట్లు గ్రామస్తులు రాష్ట్ర మానవహక్కుల వేదికకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు బీన ఢిల్లీరావు సోమవారం రాత్రి బంజిరినారాయణపురం గ్రామానికి వెళ్లి గ్రామస్తులను పరామర్శించారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్గని, గ్రామస్తుల సమ్మతి లేకుండా కొండలో క్వారీ తవ్వకాలకు అనుమతించడం సరికాదని, ఈ విషయమై నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులను బెదిరించడం ప్రజాస్వామ్య రుద్ధమని బీన ఢిల్లీరావు విలేకర్లతో పేర్కొన్నారు. మానవహక్కుల వేదిక ఈ అంశంపై పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గ్రీన్ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తాం.. బంజరినారాయణపురం సూదికొండలో అడ్డగోలుగా ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయించే అంశంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు పేర్కొన్నారు. గ్రామస్తులను పోలీసులు, అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో రూ.20కోట్లు వెచ్చించి ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి పథకం మదర్ప్లాంట్ను భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయనే కారణంతో ఏర్పాటు చేశారని, లక్షల్లో మాత్రమే ఆదాయం వచ్చే గ్రానైట్ తవ్వకాలకోసం ఇంతటి మహత్తర పథకాన్ని కూడా నాశనం చేయడం తగదన్నారు. పరిశీలనకే వెళ్లాం: సీఐ తిరుమలరావు బంజిరినారాయణపురం కొండలో తవ్వకాల విషయమై వివిధ పత్రికల్లో సోమవారం కథనాలు రావడంతో క్షేత్రస్థాయిలో విషయం తెలసుకోవడానికి మాత్రమే గ్రామానికి వెళ్లామని సోంపేట సీఐ పి.తిరుమలరావు విలేకరులకు చెప్పారు. క్వారీ తవ్వకాలకు అనుమతులున్నప్పుడు ఎవరు అడ్డుకున్నా చట్టరీత్యా నేరమని, అలా కాదని అభ్యంతరాలుంటే న్యాయపరంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే గ్రామస్తులకు తెలియజేశామని పేర్కొన్నారు. -
క్వారీల్లో మరణ మృదంగం
బతుకుదెరువు వెతుక్కుంటూ క్వారీల్లో పనులకు వస్తున్న కూలీల బతుకులు బండరాళ్ల మధ్యనే ముగిసిపోతున్నాయి. గత ఏడాది రాళ్లు కూలి ఫిరంగిపురంలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, తాజాగా అదే మండలం వేములూరుపాడు క్వారీలో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. సాక్షి, గుంటూరు : పొట్ట కూటి కోసం బండరాళ్ల మధ్య బతుకుదెరువు వెతుక్కుంటూ వస్తున్న కూలీల బతుకులు ఆ బండరాళ్ల మధ్యనే ముగిసిపోతున్నాయి. క్వారీల యజమానుల ధన దాహం, నిర్లక్ష్య వైఖరికి అమాయక కూలీలు బలవక తప్పడం లేదు. క్వారీ గోతులు కూలీల సమాధులుగా ఎందుకు మారుతున్నాయి? దీనికి కారణం ఎవరు అన్న విషయం ఇటు మైనింగ్ అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మన రాష్ట్రం కంటే ఎన్నో రెట్లు అధికంగా మైనింగ్ క్వారీలున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జరగని ప్రమాదాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. తాజాగా జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో మైనింగ్ క్వారీలో కార్మికుడు మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. శ్రీసిద్ధివినాయక స్టోన్ క్రషర్స్ మైనింగ్ ఆధ్వర్యంలో కొనసాగే క్వారీలో కొండపై డ్రిల్లింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఆలకుంట చిన్నయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. క్వారీ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా కూలీలతో పనులు చేయిస్తుండటం వల్లే ప్రమాదంలో ఇతను మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎంతమంది అమాయకులో? ఫిరంగిపురం మండలంలోని ఓ క్వారీలో గత ఏడాది మేలో బండరాళ్లు పడి ఏడుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన చోటు చేసుకున్నప్పుడు మాత్రం హుఠాహుటిన గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు మైనింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వాగ్దానాలు చేశారు. అయితే ఆ వాగ్దానాలు నీటి మీద బుడగలు గానే మారాయి. జిల్లాలో వందల సంఖ్యలో క్వారీలు నడుస్తున్నప్పటికీ అందులో ఏ ఒక్కటీ కూడా కార్మికుల భద్రత గురించి పట్టించుకోవడం లేదు. ఫిరంగిపురం ఘటన అనంతరం జిల్లాలోని పల్నాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, పేరేచెర్ల వంటి క్వారీల్లో చాలాసార్లు ప్రమాదాలు జరిగి కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంత జరుగుతున్నా మైన్స్ సేఫ్టీ అధికారులు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. దీంతో కార్మికులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. క్వారీలకు అనుమతులు ఇస్తున్న గనుల శాఖ క్వారీ యజమానులు నిర్దేశిత ప్రాంతానికి పరిమితమయ్యే తవ్వకాలు జరుపుతున్నారా? తవ్విన ఖనిజం ఎక్కడకు వెళ్తోంది? సక్రమంగా లీజులు చెల్లిస్తున్నారా? అనే విషయాలను మాత్రమే పట్టించుకుంటోంది. క్వారీలు, క్రషర్లలో పనిచేసే కూలీల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? పని ప్రదేశంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయా యాజమాన్యాలు అమలుచేస్తున్నాయా? అన్న విషయాలను గనుల శాఖ తమకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలుగా పరిగణిస్తుండటంతో గనుల్లో పని చేసే కార్మికుల జీవితాలు గాల్లో దీపాలుగా మారాయి. భద్రత ఎక్కడ.. నిబంధనల ప్రకారం క్వారీల్లో పనిచేసే కార్మికులు తలకు హెల్మెట్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఎత్తయిన ప్రదేశాల్లో పనులు నిర్వహించే చోట నెట్ ఏర్పాటు చేయాలి. కార్మికుడికి తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలి. మహిళా కార్మికులకు పనిచేసే చోట వారికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. అయితే క్వారీల్లో కార్మి కుల భద్రత మాట అటుంచితే కొన్ని చోట్ల కార్మికులు తాగేందుకు మంచినీటి సౌకర్యాలు కూడా పలు క్వారీ యజమానులు కల్పించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉండటంతో అధికారులు ఆయా క్వారీల్లో కార్మికుల భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహించడం లేదు. మైనింగ్ క్వారీల నిర్వాహకులు సైతం అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
అసలు దోషులెవరు?
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామం వద్ద ఈ నెల మూడున జరిగిన క్వారీ పేలుడు ఘటనలో వాస్తవాలు మసకబారుతున్నాయి. అసలు దోషులు ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఘటనలో పది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తం 11 మంది అమాయకుల ప్రాణాలు పోయిన ఈ విషాదకర ఘటన జరగడానికి కారకులైన ‘అవినీతి జలగలు’ ఎవరన్న వాస్తవాలు నిగ్గుతేలడం లేదు. క్వారీలో జరుగుతున్న విధ్వంసకర పేలుళ్లపై అక్కడి ప్రజలు పలు పర్యాయాలు జిల్లా సర్వోన్నతాధికారి మొదలు.. కింది స్థాయి అధికారి వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడం, విచారణ జరపడం, నివేదికలు అందగానే మిన్నకుండిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు నామమాత్రంగా కూడా లేకపోవడంతో ఇంతటి విస్ఫోటనం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఆ నివేదికలో ఏముంది? హత్తిబెళగల్ క్వారీలో బ్లాస్టింగ్స్పై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్యను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఈ ఏడాది జూలై 19న విచారణ చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్య గ్రామస్తుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఏదైనా ఘోరం జరిగితే అందుకు తహసీల్దార్‌తో పాటు క్వారీ యజమాని బాధ్యత వహించాల్సి ఉం టుందని హెచ్చరించారు. ఇదే విషయమై నివేదికను ఉన్నతాధికారులకు కూడా అందజేశారు. పేలుళ్లతో ప్రమాదం జరుగుతుందని నివేదిక వచ్చినా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలోనే ఘోర దుర్ఘటన జరిగింది. కాగా.. పేలుడు ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మొక్కుబడిగా ఉన్నాయని పలువురు తప్పుబడుతున్నారు. ఏ కొందరినో బాధ్యులను చేస్తూ.. అసలు దోషులను వదిలేస్తోందని ఆరోపిస్తున్నారు. క్వారీ యజమాని శ్రీనివాస్ చౌదరి అరెస్ట్ కర్నూలు/అగ్రికల్చర్/ ఆలూరు: హత్తి బెళగల్ పేలుడు ఘటనకు సంబంధించి విఘ్నేశ్వర స్టోన్ క్రషర్స్ యజమాని శ్రీనివాసచౌదరి, క్వారీ మేనేజర్, సేల్స్‌మెన్ బోయరమేష్, సూపర్వైజర్ మహబూబ్‌బాష, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన లేబర్ మేస్త్రీలు కైలాష్, శ్యామ్యూల్సాహు, ఎక్స్‌ప్లోజివ్ మేటీ వాల్మీకి నారాయణప్ప తదితరులను హాలహర్వి మండలం క్షత్రగుడి చెక్‌పోస్టు వద్ద ఆదోని డీఎస్పీ వైబీ ప్రసాద్, కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వీరిని ఆలూరు సివిల్ జూనియర్ జడ్జి కోర్టులో హాజరు పరిచగా జడ్జి కాశీ విశ్వనాథా చారి రిమాండ్‌కు ఆదేశించారు. ఈ కేసులో మరి కొంతమంది పాత్ర ఉన్నందున దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేసుకు సంబంధించిన ఇతర సాక్ష్యాలు, పూర్తి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే ఆదోని డీఎస్పీ,ఆలూరు సీఐకి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆలూరు తహసీల్దార్, ఆర్ఐ, ఎస్ఐలపై వేటు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించినా పర్యవేక్షణ లేదనే కారణంతో ఆలూరు తహసీల్దారు బి.నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, ఎస్ఐ గోపీనాథ్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. -
సుద్ద క్వారీలో ఘోరం
వెల్దుర్తి: సిద్ధినగట్టు సమీపంలోని ఓ సుద్ద క్వారీలో గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. బోయనపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శ్రీను కుమారుడు వడ్డె నాగరాజు(17) జేసీబీ ఆపరేటర్‌గా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన దుబ్బరాజు కుమారుడు వడ్డే హరి(16) ఇటీవల వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో వడ్డే నాగరాజు వెంట జేసీబీ హెల్పర్‌గా వెళ్లాడు. సిద్ధినగట్టు సమీపంలోని వెల్దుర్తికి చెందిన పారిశ్రామిక వేత్త క్వారీలో సాయంత్రం పూట ఇద్దరూ సుద్ద తవ్వుతుండగా వీరు ఉన్న ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనలో వారు జేసీబీతో సహా దాదాపు 20 అడుగుల లోతులో పడ్డారు. ఆ తర్వాత పైనుంచి సుద్దపడడంతో అందులో కూరుకుపోయారు. జేసీబీ కోసం వచ్చిన కొందరు వారిని గుర్తించారు. వెంటనే సుద్దను తొలగించి జేసీబీ అద్దాలు బద్దలుకొట్టి వారిని వెలికి తీసి ట్రాలీ ఆటోలో బ్రహ్మగుండం ప్రాంతానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన వెంటనే హరి మరణించాడు. చేతికొచ్చిన కుమారులు హఠాన్మరణం చెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ–2 నగేష్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ఒకేసారి మృతి చెందడంతో బోయినపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా సంఘటనకు అరగంట ముందు భారీ వడగండ్ల వర్షం కురిసింది. ఈకారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. -
క్వారీ కార్మికులకు శిక్షణ ఇవ్వాలి
వరంగల్: గ్రానైట్ క్వారీల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్(సేఫ్టీ) ఎ.రాంబాబు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా గ్రానైట్ క్వారీ, స్టోన్ క్రషర్స్ వృత్తి శిక్షణ కేంద్రం అధ్వర్యంలో గనుల యాజమానులు, మేనేజర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రానైట్, స్టోన్ క్రషర్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. మైనర్లను పెట్టుకుంటే చట్టరీత్య నేరమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నరేష్, ఆర్.వెంకటేశ్వర్రావు, నర్సింహరెడ్డి, వెంకటేశ్వర్లు, వీటీసీ మేనేజర్ బి.చంద్రు, అసిస్టెంట్ జియాలజిస్టు టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత
నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 36మంది కార్మికులు మరణించారని పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు.