హత్తిబెళగల్ క్వారీ యజమాని శ్రీనివాస్ చౌదరిని వాహనంలో ఆలూరు కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామం వద్ద ఈ నెల మూడున జరిగిన క్వారీ పేలుడు ఘటనలో వాస్తవాలు మసకబారుతున్నాయి. అసలు దోషులు ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఘటనలో పది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మొత్తం 11 మంది అమాయకుల ప్రాణాలు పోయిన ఈ విషాదకర ఘటన జరగడానికి కారకులైన ‘అవినీతి జలగలు’ ఎవరన్న వాస్తవాలు నిగ్గుతేలడం లేదు. క్వారీలో జరుగుతున్న విధ్వంసకర పేలుళ్లపై అక్కడి ప్రజలు పలు పర్యాయాలు జిల్లా సర్వోన్నతాధికారి మొదలు.. కింది స్థాయి అధికారి వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడం, విచారణ జరపడం, నివేదికలు అందగానే మిన్నకుండిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు నామమాత్రంగా కూడా లేకపోవడంతో ఇంతటి విస్ఫోటనం జరిగిందని స్థానికులు అంటున్నారు.
ఆ నివేదికలో ఏముంది?
హత్తిబెళగల్ క్వారీలో బ్లాస్టింగ్స్‌పై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్యను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఈ ఏడాది జూలై 19న విచారణ చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్య గ్రామస్తుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఏదైనా ఘోరం జరిగితే అందుకు తహసీల్దార్‌తో పాటు క్వారీ యజమాని బాధ్యత వహించాల్సి ఉం టుందని హెచ్చరించారు. ఇదే విషయమై నివేదికను ఉన్నతాధికారులకు కూడా అందజేశారు. పేలుళ్లతో ప్రమాదం జరుగుతుందని నివేదిక వచ్చినా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలోనే ఘోర దుర్ఘటన జరిగింది. కాగా.. పేలుడు ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మొక్కుబడిగా ఉన్నాయని పలువురు తప్పుబడుతున్నారు. ఏ కొందరినో బాధ్యులను చేస్తూ.. అసలు దోషులను వదిలేస్తోందని ఆరోపిస్తున్నారు.
క్వారీ యజమాని శ్రీనివాస్ చౌదరి అరెస్ట్
కర్నూలు/అగ్రికల్చర్/ ఆలూరు: హత్తి బెళగల్ పేలుడు ఘటనకు సంబంధించి విఘ్నేశ్వర స్టోన్ క్రషర్స్ యజమాని శ్రీనివాసచౌదరి, క్వారీ మేనేజర్, సేల్స్‌మెన్ బోయరమేష్, సూపర్‌వైజర్ మహబూబ్‌బాష, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన లేబర్ మేస్త్రీలు కైలాష్, శ్యామ్యూల్‌సాహు, ఎక్స్‌ప్లోజివ్ మేటీ వాల్మీకి నారాయణప్ప తదితరులను హాలహర్వి మండలం క్షత్రగుడి చెక్‌పోస్టు వద్ద ఆదోని డీఎస్పీ వైబీ ప్రసాద్, కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వీరిని ఆలూరు సివిల్ జూనియర్ జడ్జి కోర్టులో హాజరు పరిచగా జడ్జి కాశీ విశ్వనాథా చారి రిమాండ్‌కు ఆదేశించారు. ఈ కేసులో మరి కొంతమంది పాత్ర ఉన్నందున దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేసుకు సంబంధించిన ఇతర సాక్ష్యాలు, పూర్తి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే ఆదోని డీఎస్పీ,ఆలూరు సీఐకి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆలూరు తహసీల్దార్, ఆర్‌ఐ, ఎస్‌ఐలపై వేటు
నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించినా పర్యవేక్షణ లేదనే కారణంతో ఆలూరు తహసీల్దారు బి.నాగరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు, ఎస్‌ఐ గోపీనాథ్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment