పిడుగురాళ్ళ మండలం సీతారామపురం క్వారీ
బతుకుదెరువు వెతుక్కుంటూ క్వారీల్లో పనులకు వస్తున్న కూలీల బతుకులు బండరాళ్ల మధ్యనే ముగిసిపోతున్నాయి. గత ఏడాది రాళ్లు కూలి ఫిరంగిపురంలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, తాజాగా అదే మండలం వేములూరుపాడు క్వారీలో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
సాక్షి, గుంటూరు : పొట్ట కూటి కోసం బండరాళ్ల మధ్య బతుకుదెరువు వెతుక్కుంటూ వస్తున్న కూలీల బతుకులు ఆ బండరాళ్ల మధ్యనే ముగిసిపోతున్నాయి. క్వారీల యజమానుల ధన దాహం, నిర్లక్ష్య వైఖరికి అమాయక కూలీలు బలవక తప్పడం లేదు. క్వారీ గోతులు కూలీల సమాధులుగా ఎందుకు మారుతున్నాయి? దీనికి కారణం ఎవరు అన్న విషయం ఇటు మైనింగ్ అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మన రాష్ట్రం కంటే ఎన్నో రెట్లు అధికంగా మైనింగ్ క్వారీలున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జరగని ప్రమాదాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. తాజాగా జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో మైనింగ్ క్వారీలో కార్మికుడు మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. శ్రీసిద్ధివినాయక స్టోన్ క్రషర్స్ మైనింగ్ ఆధ్వర్యంలో కొనసాగే క్వారీలో కొండపై డ్రిల్లింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఆలకుంట చిన్నయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. క్వారీ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా కూలీలతో పనులు చేయిస్తుండటం వల్లే ప్రమాదంలో ఇతను మృతి చెందినట్టు తెలుస్తోంది.
ఎంతమంది అమాయకులో?
ఫిరంగిపురం మండలంలోని ఓ క్వారీలో గత ఏడాది మేలో బండరాళ్లు పడి ఏడుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన చోటు చేసుకున్నప్పుడు మాత్రం హుఠాహుటిన గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు మైనింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వాగ్దానాలు చేశారు. అయితే ఆ వాగ్దానాలు నీటి మీద బుడగలు గానే మారాయి. జిల్లాలో వందల సంఖ్యలో క్వారీలు నడుస్తున్నప్పటికీ అందులో ఏ ఒక్కటీ కూడా కార్మికుల భద్రత గురించి పట్టించుకోవడం లేదు. ఫిరంగిపురం ఘటన అనంతరం జిల్లాలోని పల్నాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, పేరేచెర్ల వంటి క్వారీల్లో చాలాసార్లు ప్రమాదాలు జరిగి కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంత జరుగుతున్నా మైన్స్ సేఫ్టీ అధికారులు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. దీంతో కార్మికులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
క్వారీలకు అనుమతులు ఇస్తున్న గనుల శాఖ క్వారీ యజమానులు నిర్దేశిత ప్రాంతానికి పరిమితమయ్యే తవ్వకాలు జరుపుతున్నారా? తవ్విన ఖనిజం ఎక్కడకు వెళ్తోంది? సక్రమంగా లీజులు చెల్లిస్తున్నారా? అనే విషయాలను మాత్రమే పట్టించుకుంటోంది. క్వారీలు, క్రషర్లలో పనిచేసే కూలీల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? పని ప్రదేశంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయా యాజమాన్యాలు అమలుచేస్తున్నాయా? అన్న విషయాలను గనుల శాఖ తమకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలుగా పరిగణిస్తుండటంతో గనుల్లో పని చేసే కార్మికుల జీవితాలు గాల్లో దీపాలుగా మారాయి.
భద్రత ఎక్కడ..
నిబంధనల ప్రకారం క్వారీల్లో పనిచేసే కార్మికులు తలకు హెల్మెట్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఎత్తయిన ప్రదేశాల్లో పనులు నిర్వహించే చోట నెట్ ఏర్పాటు చేయాలి. కార్మికుడికి తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలి. మహిళా కార్మికులకు పనిచేసే చోట వారికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. అయితే క్వారీల్లో కార్మి కుల భద్రత మాట అటుంచితే కొన్ని చోట్ల కార్మికులు తాగేందుకు మంచినీటి సౌకర్యాలు కూడా పలు క్వారీ యజమానులు కల్పించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉండటంతో అధికారులు ఆయా క్వారీల్లో కార్మికుల భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహించడం లేదు. మైనింగ్ క్వారీల నిర్వాహకులు సైతం అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment