ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక భారీమొత్తం నగదు, అది కూడా ఒక ప్రభుత్వ ఇంజనీర్ వద్ద దొరికింది. బెంగళూరులో కొందరు రాజకీయ పెద్దలకు ఇవ్వడానికని ఆ నగదును తెచ్చినట్లు సమాచారం. అది ఎవరి కోసమన్నది సస్పెన్స్
సాక్షి, బెంగళూరు: ఆదాయ పన్ను విభాగం సోదాల్లో శుక్రవారం సుమారు రూ. 2 కోట్లు పట్టుబడ్డాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. నగరంలోని రాజ్‌మహల్ హోటల్‌పై దాడి చేసి ఒక ప్రభుత్వ ఇంజనీర్ నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఎన్నికల ఖర్చుల కోసం నాయకులకు ఇవ్వాలని తెచ్చినట్లు తేలింది. ఇందుకు కాంట్రాక్టర్ల నుంచి 10 శాతం, 20 శాతం మేర కమీషన్ రూపంలో వసూళ్లు చేసినట్లు సమాచారం.
ఐటీ దాడులతో పరారు
వివరాలు... హావేరిలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసే నారాయణ గౌడ బి.పాటిల్ బెంగళూరుకు వచ్చి ఆనందరావ్ సర్కిల్‌లో రాజ్‌మహల్ హోటల్‌లో బస చేశారు. ఐటీ అధికారులు అనుమానంతో ఆయన గదిలో సోదాలు జరపగా, పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడింది. లెక్కించగా రూ.2 కోట్లుగా తేలింది. ఐటీ దాడులు తెలిసి నారాయణగౌడ అదృశ్యమయ్యాడు. ఆయన ఉపయోగిస్తున్న కేఏ25పి2774 కారు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హావేరిలోని నందిలేఔట్‌లో ఉన్న ఆయన నివాసంలోనూ సోదాలు జరపగా రూ. 25 లక్షలు దొరికాయి.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు
లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఐటీ అధికారులు బడా అధికారులు,కాంట్రాక్టర్లు, బ్రోకర్లపై నిఘా పెట్టింది. నారాయణ గౌడ గత కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ల నుంచి ఎన్నికల ఖర్చుల పేరుతో కమీషన్లను వసూలు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుంది. సేకరించిన ఆ డబ్బులను ప్రముఖ నేతలకు ఇచ్చేందుకు హావేరి నుంచి శుక్రవారం బెంగళూరుకు వచ్చి బస చేశారు. హోటల్‌లో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. ఐటీ అధికారుల బృందం ఆయ న గదుల్లో ఒకదానిన్ని తెరిచి సోదాలు చేపట్టింది. రూ. 2 కోట్ల నగదు, ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో గదిలో నారాయణ గౌడ నిద్రిస్తున్నారు. అధికారుల అలికిడిని గమనించి పారిపోయారు. ఏ రాజకీయ పార్టీకి, నేతకు డబ్బులు ఇవ్వడానికి తెచ్చారనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment