ప్రమాదానికి కారణమైన బొలేరో వాహనం రోడ్డు కింద బోల్తా పడిన దృశ్యం
కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఓ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టడంతో బావామరదలు అక్కడికక్కడే మృతి చెందారు. మరదలు చెయ్యి తెగిపోయి సుమారు 20 గజాల దూరంలో పడిపోయింది. ఆదివా రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు... కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూతురు రవళి వివాహం కుకునూరుపల్లిలోని కోల ఆంజనేయులు ఫంక్షన్‌హాల్ జరిగింది.
దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లికి చెందిన రెడ్డి వెంకట్‌రెడ్డి (35), వెంకట్‌రెడ్డి మేనమరదలు, తొగుట మండలం వేముల గట్టు గ్రామానికి చెందిన శేరిపల్లి సౌమ్య(12), దుబ్బాక మండలంలోని బొప్పాపూర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి చెల్లెలు కవిత (28), ఆమె కూతురు శ్రీవిద్య(6)లు ద్విచక్ర వాహనంపై ఈ పెళ్లికి వచ్చారు. కాగా ఎండ వేడిమికి తట్టుకోలేక వారు స్థానిక వైద్యుని వద్దకు వచ్చి మందులు తీసుకుని మళ్ళీ ఫంక్షన్ హాల్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలో కుకునూరుపల్లి పోలీస్టేషన్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ చేస్తుండగా సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపునకు వెళుతున్న బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో వెంకట్‌రెడ్డి, శేరిపల్లి సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, శ్రీవిద్యలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కవిత, శ్రీవిద్యలను హైదరాబాద్‌కు తరలించారు. బొలేరో వాహనం ఢీకొట్టడంతో సౌమ్య కుడి చెయ్యి తెగిపోయి సుమారు 20 గజాల దూరంలో పడిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్‌లోని బంధువులు, కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో సుమారు అరగంటపాటు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవడం తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సౌమ్య తండ్రి హన్మంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఈ సంఘటనతో వెంకట్‌రెడ్డి స్వగ్రామం రఘోత్తంపల్లి, సౌమ్య స్వగ్రామం వేముల గట్టులో విషాదచాయలు అలుముకున్నాయి. సౌమ్య 8వ తరగతి చదువుతోందని, వెంకట్‌రెడ్డికి నెల పదిహేను రోజుల కిందట పాప జన్మించిందని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment